Mon Dec 23 2024 10:31:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : కాంగ్రెస్ కు అనుకూల ట్రెండ్ ఎందువల్ల?...ఇవి కదా కారణాలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న టాక్ నడుస్తుంది. సర్వేలు కూడా అవే చెబుతున్నాయి
ఎక్కడ చూసినా ఒకటే టాక్. ఒకటే ట్రెండ్.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని. ఎందుకొచ్చిందో ఈ వేవ్ అర్థం కాకపోయినా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. పల్లె నుంచి పట్టణాల వరకూ.... చివరకు హైదరాబాద్ నగరంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా బలమైన గాలులు వీస్తున్నాయన్న మౌత్ టాక్ వినిపిస్తుంది. ఎవరి నోట విన్నా ఇదే మాట. తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే తప్పేంటంట? అన్నది కూడా ప్రజల్లో నాటుకుపోయింది. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి ఉండవచ్చు. కానీ పోలీసులతో దానిని భగ్నంచేయడం పెద్ద పని కాదు. కానీ గాంధీ కుటుంబం తాము రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నది ప్రజల్లో ఇప్పుడు నెలకొన్న భావనగా ఏర్పడింది.
మూడు నెలల నుంచే...
సర్వేలదే కాదు.. విశ్లేషకులు సయితం ఈ మాటను అంగీకరిస్తున్నారు. అయితే పోలింగ్ సమయానికి ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ కాంగ్రెస్ కు పాజిటివ్ గా టాక్ నడుస్తుంది. ఈసారి తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూలమైన పవనాలే వీస్తున్నాయని చెప్పకతప్పదు. ఎన్నికల షెడ్యూల్ మూడు నెలల ముందు వరకూ కాంగ్రెస్ పట్ల అంతగా టాక్ లేదు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు కొట్లాడుకుంటున్నాయన్న మాట తప్ప మరొకటి వినిపించలేదు. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేవలం రెండోస్థానం కోసమే పోటీ జరుగుతుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి కాంగ్రెస్ పుంజుకోవడం, బీజేపీ వెనకబడి పోవడం జరిగిపోయాయి.
అంతా సజావుగానే జరిగినా...
ఇక పదేళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు కూడా కొంత విసుగు చెందారని అనుకోవాలి. శాంతి భద్రతల సమస్య తలెత్తకపోయినా, అభివృద్ధి వేగవంతంగానే జరిగినా... సంక్షేమ పథకాలు అందుతున్నా సరే... ఏదో తెలియని అసంతృప్తి.. అసహనం మాత్రం ప్రజల్లో ఉందన్నది మాత్రం యదార్థం. అది నేతల పోకడల వల్ల కావచ్చు. తెలంగాణ వస్తే తాము ఆశించిన స్థాయిలో లబ్ది జరగలేదన్న భావన అయి ఉండవచ్చు. చెప్పలేం కానీ మొత్తం మీద అధికార పార్టీపై అసంతృప్తి మాత్రం చాప కింద నీరులా విస్తరించింది. ఇక కొన్ని సంక్షేమ పథకాలు కొందరికే అందడం, తమకు దక్కకపోవడం కూడా వారిలో అసహనాన్ని రాజేసింది. ఇప్పుడు మరో పార్టీ వచ్చినా గత ప్రభుత్వం ప్రకటించిన, అమలు చేసిన పథకాలను రద్దు చేసే సాహసం చేయదన్న నమ్మకం కూడా కారు పార్టీకి కొంత ఇబ్బంది ఏర్పడిందంటున్నారు.
ఎన్నికలప్పుడే...
కర్ణాటకలో జరుగుతున్న కష్టనష్టాలను బీఆర్ఎస్ నేతలు పదే పదే ఎత్తి చూపతున్నా అవి పెద్దగా వర్క్అవుట్ అయ్యేట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయినోళ్లు మళ్లీ మారాలంటే చాలా కష్టం. అదీ కాకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు, మూడు సార్లు గెలిచిన వాళ్లు కావడంతో వారిపైన కూడా తీవ్ర అసంతృప్తి ఎక్కువగా ఉందంటున్నారు. ప్రభుత్వం పై కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును చాలా మంది బాహాటంగా తప్పుపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. ఎన్నికలప్పుడు తప్పించి బీఆర్ఎస్ అధినేత బయటకు రారని, తమ గోడు వినరని ప్రజలు విశ్వసించడం కూడా కారు పార్టీకి సమస్యగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మహిళలు, యువత, నిరుద్యోగులు చివరకు ముస్లిం సామాజికవర్గం కూడా కాంగ్రెస్ వైపు చూస్తుందన్న వార్తలతో గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే చివరకు ఏం జరుగుతుందన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా.. వేవ్ మాత్రం హస్తం పార్టీ వైపే ఉంది.
Next Story