Thu Nov 14 2024 16:56:38 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : అభ్యర్థుల గుండెల్లో దడ... ఓటింగ్ ఈసారి తగ్గుతుందా? ఎవరికి లాభం?
ఈసారి పోలింగ్ డే గురువారం వచ్చింది. నవంబరు 30వ తేదీ గురువారం కావడంతో ఇప్పుడు అభ్యర్థుల్లో దడ మొదలయింది
ఎన్నికలంటే కేవలం అభ్యర్థుల ఎంపిక ప్రచారం ఒక్కటే కాదు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఎలక్షనీరింగ్. ఎంత ఎక్కువ పోలింగ్ జరిగితే అంత మంచిదని కొందరు భావిస్తుంటారు. పోలింగ్ శాతం తగ్గితే మేలని మరికొందరు అనుకుంటారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి పోలింగ్ శాతం తగ్గాలని కోరుకుంటుంది. ఎందుకంటే తమపై ఉన్న వ్యతిరేక ఓటు పోలింగ్ శాతం తగ్గడంతో కొంత అనుకూలత ఉంటుందని భావిస్తుంది. అలాగే విపక్షం మాత్రం పోలింగ్ శాతం ఎంత ఎక్కువయితే అంత మంచిదని భావిస్తుంది. అది తమకు సానుకూలంగా మారి ఎక్కువ స్థానాలు తమ ఖాతాలో పడే అవకాశముందని అంచనా వేస్తుంది. అయితే హైదరాబాద్లో బలం తక్కువగా భావిస్తున్న పార్టీలు మాత్రం ఆనందంలో మునిగితేలుతున్నాయి.
గురువారం రావడంతో...
అయితే ఈసారి పోలింగ్ డే గురువారం వచ్చింది. నవంబరు 30వ తేదీన గురువారం కావడంతోనే ఇప్పుడు అభ్యర్థుల్లో దడ మొదలయింది. గురువారం ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తారు. తర్వాత శుక్రవారం మినహాయిస్తే శని, ఆదివారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సెలవు దినాలు. అంటే ఒకరోజు శుక్రవారం సెలవు పెట్టుకుంటే నాలుగురోజులు వరసగా సెలవు దినాలు లభిస్తాయి. ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది. లాంగ్ వీకెండ్ కావడంతో లాంగ్ టూర్ ప్లాన్ చేసుకునే వీలుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు బ్యాంకు ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు రావడంతో పోలింగ్ శాతం తగ్గుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో...
ప్రధానంగా నగరాలు, పట్టణాల్లోనే ఈ సమస్య ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకరోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు సెలవులు రావడంతో ఇక ఆగే అవకాశమే ఉండదు. పని వత్తిడిలో ఉండే వారు ఓటును వినియోంచుకుందామని భావించే కంటే తమ పర్సనల్ లైఫ్ కే ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఈసారి హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం తగ్గే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఓటు మన హక్కు. ఐదేళ్లకు ఒకసారి వినియోగించుకునే ఓటుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించాలి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓటు ఒక్కటే మార్గం.
ఎన్ని చర్యలు తీసుకున్నా....
ఇప్పటికే అన్ని రకాలుగా ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తుంది. ఎక్కవ శాతం పోలయ్యేలా ప్రకటనల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక చర్యలు చేపట్టింది. అయినా ఒకరోజు సెలవు పెడితే నాలుగు రోజులు వరస సెలవులు రావడంతోనే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. తమకు పడాల్సిన ఓటు పడదేమోనన్న ఆందోళన అభ్యర్థుల్లో కనపడుతుంది. అందుకే ఇప్పుడు పోలింగ్ డే నాడు జరిగే శాతంపై అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. గురువారం కాకుండా మంగళ, బుధవారాల్లో పోలింగ్ వస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ఖచ్చితంగా పోలింగ్ కు రావాలని కోరుకుంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story