Fri Nov 22 2024 13:48:47 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బలమా? బలహీనతా? చేరికలపై చెప్పలేని పరిస్థితి
బీఆర్ఎస్ లో చేరికలు ఆ పార్టీకి బలం చేకూరుస్తాయా? లేక మరికొంత ఇబ్బందిగా మారతాయా? అన్నది చర్చనీయాంశమైంది
పాలు పొంగితే ఏమవుతుంది.. అంతా నేలపాలవుతుంది. అలాగే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది. రాజకీయ పార్టీలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రధానంగా అధికార పార్టీకి చేరికలు ఉత్సాహాన్ని తెచ్చే కన్నా.... క్యాడర్ లో మళ్లీ గ్రూపులకు దారి తీసే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదుర్కొనలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలతో వచ్చిన వాళ్లను వచ్చినట్లు పార్టీలో చేర్చుకుంటున్నారు. అవసరం లేని వాళ్ల ఇళ్లకు సయితం వెళ్లి మరీ వాళ్లను పార్టీలో చేరి బతిమాలుకుంటున్నారు. మూడోసారి తమదే అధికారం అని నొక్కి చెబుతున్న కారు పార్టీ నేతలు ఇలా నేతల ఇళ్లకు వెళ్లి సాగిలపడటం చూస్తుంటే అర్థం కావడం లేదా? ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు. భారత రాష్ట్ర సమితిలో ఇంతకూ చేరికలు బలం చేకూరుస్తాయా? లేదా? అన్నదే చర్చనీయాంశమైంది.
సీటు రాలేదంటేనే...
కాంగ్రెస్ లో సీటు రాలేదంటే అర్థమేంటి? పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఆ నేతను పక్కన పెట్టిందంటే ఖచ్చితంగా నేతలో ఏదైనా రాజకీయ లోపం ఉండాలి. లేదంటే ప్రజలు ఆ నేతను విశ్వసించరని అర్థం చేసుకోవాలి. సమర్థుడైన నేత అయితే కాంగ్రెస్ పార్టీయే టిక్కెట్ ఇచ్చి ఉండేది. సామాజిక సమీకరణాలు... కులాలు ఇవన్నీ ట్రాష్. గెలుపు కోసం పరితపించే పార్టీ ఇవన్నీ పైపైన చెప్పే మాటలే. కానీ తాము సర్వేలు చేయించుకుని ఖచ్చితంగా గెలిచి తీరతాడనుకున్న వారికే టిక్కెట్లను కేటాయిస్తుంది. అందులో తేడాలు రావచ్చు. రేపు గెలవనూ వచ్చు. లేకపోవచ్చు. అది వేరే ముచ్చట. ఇప్పుడయితే ఆ నేత సమర్థతను, సర్వేను బట్టి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను కేటాయిస్తుందన్నది అందరికీ తెలిసిన సంగతే.
ఆ పార్టీకి పనికి రాని నేతలు...
కానీ కాంగ్రెస్ కు పనికి రాని నేతలందరూ కారు పార్టీకి ఎలా పనికొస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. అందులో వేరే ఏమీ లేదు. తమ పార్టీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవడానికే తప్ప మరోరకమైన ప్రయోజనం ఉండదు అని ఆ పార్టీ నేతలకు తెలియంది కాదు. ఏటికి ఎదురీదుతున్నప్పుడు గడ్డిపోచ చేతికి దొరికినా చాలనుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఎవరైనా సరే పార్టీలో చేరడానికి రెడీ అని తెలిస్తే చాలు వెంటనే వెళ్లి కండువా కప్పేయడం చూస్తుంటే వారిలో కంగారు అందరికీ తెలిసిపోతుంది. గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఇటువంటి సీన్లు మనం గులాబీ పార్టీలో చూడకపోవడానికి కారణం అప్పుడు గెలుపుపై ధీమా ఉండటం. ఇప్పుడు చేరికలకు వెంపర్లాడటం ఓటమి భయమేనని చెప్పకతప్పదు.
కండువా కప్పిన వెంటనే...
సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి విషయాన్ని తీసుకుంటే.. నాగం మంచి నేతే కావచ్చు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసింది. అన్ని పార్టీలూ తిరిగి వచ్చిన నేతగా ముద్ర పడింది. కేవలం నాగర్ కర్నూలుకే పరిమితమైన నేతగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అలాంటి నాగం ఇంటికి వెళ్లి మరీ కేటీఆర్, హరీశ్ లు పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారంటే ఆ పార్టీ దయనీయ స్థితి అర్థం చేసుకోవచ్చు. మొన్న పొన్నాల అంతే. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఒక్క ఓటు అదనంగా వచ్చినా చాలునన్న బెంగ వారిలో కనిపిస్తుంది. బహిరంగ సభలో వేదికపై కనిపించిన పొన్నాల ఇక కారు పార్టీలో కనిపించరన్నది ఆ పార్టీ అధినేత చరిత్ర తెలిసిన వారికి ఎవరికైనా తెలుసు. రేపు కూడా నాగం పరిస్థిితి కూడా అంతే. కండువా కప్పేంత వరకే. తర్వాత నాగం మాట కూడా వినిపించదు. కారు నేతలతో ఫుల్లయింది. మరి ఈ చేరికలతో ఎంత మాత్రం ప్రయోజనం ఉంటుందన్నది కాలమే చెప్పాలి. కండువా కప్పినంత మాత్రాన ఓట్లు పడతాయా? అంటే ఏమో.. చెప్పలేని పరిస్థితి.
Next Story