Mon Dec 23 2024 05:56:43 GMT+0000 (Coordinated Universal Time)
అవును...ఇద్దరూ రాజీ పడ్డారు
ఎలాంటి వివాదాలు లేకుండా ఇటు గవర్నర్, అటు గవర్నమెంటు రాజీ పడినట్లే కనిపిస్తుంది
అవును.. అనుకున్నట్లు ఏదీ జరగలేదు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి వివాదాలు లేకుండా ఇటు గవర్నర్, అటు గవర్నమెంటు రాజీ పడినట్లే కనిపిస్తుంది. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఉన్నది ఉన్నట్లు గవర్నర్ చదివారు. ఒక్క అక్షరం కూడా ఆమె సొంతంగా ఉపయోగించలేదు. అందరూ ఊహించినట్లు గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాతారని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళ సై సౌందర రాజన్ సంప్రదాయాలను పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కే పరిమితమయ్యారు.
కేంద్ర ప్రభుత్వంపై...
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపించింది. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారని సమాచారం. ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా చేయకుండా బడ్జెట్ ప్రసంగాన్ని గవర్నర్ కు ఇచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఒంటికాలు మీద లేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన సమస్యల గురించి ఎక్కడా గవర్నర్ ప్రసంగంలో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్లమెంటులో అనేక సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేసరికి సంయమనం పాటించింది.
సంయమనంతో...
అందువల్లనే గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. ఒక్క అడుగు ప్రభుత్వం వెనక్కు వేసినా తాము అనుకున్నది సాధించినట్లయింది. అలాగే గవర్నర్ కూడా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, కేవలం రాష్ట్ర పథకాలను, అభివృద్ధి, సంక్షేమం గురించే గవర్నర్ ప్రస్తావించారు. ఎక్కడా స్క్రిప్ట్ దాటి బయటకు వెళ్లలేదు. అందరూ ఊహించినట్లు తాను చేయనని చెప్పకనే చెప్పారు. గత నెల 26న రిపబ్లిక్ డే ఉత్సవాల రోజున ప్రభుత్వాన్ని విమర్శించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం చాలా వరకూ సంయమనం పాటించారు.
ఉదయం నుంచే...
గవర్నర్ కు ఉదయం నుంచే ప్రొటోకాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. యాదగిరి గుట్టకు దర్శనం కోసం వెళ్లిన గవర్నర్ కు సాదరంగా ఆహ్వానించారు. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ ను స్వయంగా కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత కూడా గవర్నర్ ను కేసీఆర్ స్వయంగా తోడ్కొని వెళ్లి వీడ్కోలు పలికారు. అంతా సజావుగా జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు తగ్గారు? ఎవరు నెగ్గారు? అన్నది కాకున్నా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ప్రశాంతంగా ముగిసింది.
Next Story