Mon Dec 23 2024 05:46:05 GMT+0000 (Coordinated Universal Time)
సవాళ్లను ఎదుర్కొని సంక్షేమానికి
తెలంగాణ ఎన్నో విజయాలను సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
తెలంగాణ ఎన్నో విజయాలను సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అని గవర్నర్ అన్నారు. తెలంగాణ ఎన్నో విజయాలను సాధించిందన్నారు. తలసరి ఆదాయం 3,17,115 రూపాయలకు పెరిగిందని చెప్పారు. ఇందులో ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు.
రైతుల కోసం...
మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం ధృడ నిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు. 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల పంటపెట్టుబడి లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించే కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. తెలంగాణ ప్రజలు సురక్షిత, స్వచ్ఛమైన నీటిని తాగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు.
సంక్షేమం ద్వారా...
దళితబంధు పథకం ద్వారా పేద వర్గాలను ఆదుకునేందుకు ప్రయత్నం ప్రారంభమయిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తామని, అది వెనక్కు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే లైసెన్సుల మంజూరులోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఆసరా ద్వారా పింఛన్లను అందిస్తున్నామని, వీటి సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తుందన్నారు.
ప్రతి బియ్యపు గింజను...
బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. గొర్రెల పంపిణీ ద్వారా దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. చేపల పంపకం పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, దానికి అనుగుణంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండించే ప్రతి బియ్యపు గింజను కొంటున్నామని తెలిపారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గవర్నర్ తెలిపారు. 41 బీసీల కులాల కోసం హైదరాబాద్ ఆత్మగౌరవ భవనాలను నిర్మించామని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతంలో జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.
మంచినీటిని...
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు. గీతకార్మికుల కోసం వైన్ షాపుల కేటాయింపుల్లో పదిహేను శాతం రిజర్వేషన్లను కల్పించామని తెలిపారు. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కల్పించామని చెప్పారు. వైద్య సదుపాయాలను అందించేందుకు హైదరాబాద్ నలుమూలలా నాలుగు చోట్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. యాదగిరి గుట్టను పునరుద్ధరించామని తెలిపారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయిందని, దానికి బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టామని చెప్పారు. తెలంగాణ ఐటీ రంగంలో దూసుకుపోతుందన్నారు. లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు.
Next Story