Sun Mar 30 2025 15:57:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Assembly : హామీలు అమలు చేస్తాం.. అన్ని వర్గాలను ఆదుకుంటాం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. రైతులు, విద్యార్థులు, యువత, మహిళల సంక్షేమంతోనే ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏడాది కాలంలో జరిగిందన్నారు. ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. అనేక ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
వ్యవసాయ రంగంలో ...
అభివృద్ధి - సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకెళుతున్నామని గవర్నర్ వివరించారు. వ్యవసాయ రంగంలో మంచి ప్రగతిని సాధించామన్న గవర్నర్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి గుండెకాయ వంటి వారిని అన్నారు. ప్రజలే కేంద్రంగా తమ పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజల సాకారానికే ఈ బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. తెలంగాణ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రైతు భరోసా నిధులను కూడా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలలకు కూడా రైతు భరోసాను అందిస్తున్నామని గవర్నర్ చెప్పారు.
మహిళ సంక్షేమానికి...
సంక్షేమానికి, సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు. రాష్ట్రం అభివృధ్ది ప్రగతి వైపు పరుగులు పెడుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని గవర్నర్ తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా, ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ను అందచేస్తున్నామని తెలిపారు. మహిళలకు తమ కాళ్లు మీద నిలబడేందుకు అనేక కార్యక్రమాలను తీసుకు వచ్చామని తెలిపారు. విద్యుత్తు బిల్లుల్లో కూడా రాయితీలు కల్పించామన్న గవర్నర్ అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో తమ ప్రభుత్వం ప్రగతిని సాధించిందని గవర్నర్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Next Story