Fri Mar 21 2025 00:42:54 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Budget : నేడు తెలంగాణ బడ్జెట్.. ఆ హామీలు నెరవేరేనా?
తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మూడో సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు

తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మూడో సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ అంచనాలు ఎంత వరకూ ఉంటాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అలాగే కేటాయింపులపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వత ఇది మూడో సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.91 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను సభ ముందు ఉంచారు. ఈ సారి బడ్జెట్ అంచనాలు మూడు లక్షల కోట్ల రూపాయలు దాటే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కొన్నింటిని అమలు చేసి...
అయితే ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ, రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నిరుద్యోగులకు వరస నోటిఫికేషన్లు ఇస్తూ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. సన్నబియ్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను కూడా ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీవ్ యువవికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు ఐదులక్షలు ఇచ్చే రుణం కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీటికి ఈ బడ్జెట్ లో తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సి ఉంది. ఇక మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణకు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కేటాయింపులు కూడా ఉండే అవకాశాలున్నాయి.
ముఖ్యమైన హామీలు...
అయితే మరికొన్ని ముఖ్యమైన హామీలు అలాగే ఉండిపోయాయి. పింఛను మొత్తాన్ని పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఇంత వరకూ అమలు చేయలేకపోయింది. అలాగే మహిళలకు పదిహేను వందలు నెలకు ఇచ్చే మహాలక్ష్మి పథకం కూడా గ్రౌండ్ కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించినా ఇంతవరకూ సాధ్యం కాలేదు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వీటిలో కొన్నింటికైనా నిధులు కేటాయించాల్సి ఉంది. వీటతో పాటు అభివృద్ధి, జీతభత్యాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద మూడో బడ్జెట్ భట్టికి కత్తి మీద సాము వంటిదేనని చెప్పాలి.
Next Story