Tue Nov 05 2024 10:32:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆల్ ఈజ్ వెల్.. బట్?
తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటుంది. నేతలు ఐక్యంగా కొనసాగితే విజయం తమదేనన్న ధీమా వ్యక్తమవుతుంది
క్యాడర్ పుష్కలం. ఓటు బ్యాంకు కూడా అధికం.కానీ గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని అనుకున్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఈసారైనా పట్టు నిలుపుకోగలుగుతుందా? లేదా ఎప్పటిలాగే చతికలపడుతుందా? అన్నదే ప్రశ్న. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గౌరవిస్తారు. అండగా నిలవాలని భావిస్తారు.కానీ నేతల స్వయంకృతాపరాధంతోనే గత రెండు ఎన్నికల్లో అనేక సీట్లు చేజారి పోయాయి. కానీ ఈసారి అలాంటి అవకాశాలకు తావివ్వకుండా ఎలాగైన పవర్ లోకి రావాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతతో పాటు కార్యకర్తకూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కూడా కనిపించడం శుభపరిణామంగా చెప్పాలి.
వెల్లువెత్తిన దరఖాస్తులు…
కాంగ్రెస్ వైరస్ లాంటిదంటారు. దానికి చావులేదనేది రాజకీయంగా అందరూ ఒప్పుకునే వాస్తవం. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటుంది. టిక్కెట్ల కోసం పోటీ పడటం చూస్తేనే అర్థమవుతుంది. 119 నియోజకవర్గాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీకి అందాయంటే ఆశావహుల సంఖ్య ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరూ ఊరికే టిక్కెట్లు ఆశించరు. హస్తం గుర్తుపై పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకంతో పాటు జనంలో ఉన్నవేవ్ ను కూడా వారు క్షేత్రస్థాయిలో పసిగడతారు. అప్పుడే టిక్కెట్ల కోసం పోటీ పెరుగుతుంది. రెండు సార్లు ఓటమి పాలయిన పార్టీ అయినప్పటికీ గాంధీభవన్ లో టిక్కెట్ ల కోసం జరిగిన జాతర చూసిన వారెవరికైనా కాంగ్రెస్ కు కొంత సానుకూల పరిస్థితులున్నాయని ఇట్టే గ్రహించవచ్చు.
ఐక్యతతో…
అందుకేనేమో కాంగ్రెస్ నేతలు ఈసారి ఐక్యతారాగంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి గొడవలు లేవు. వీధినపడి విమర్శలు చేసుకోవడం లేదు. రేపు టిక్కెట్ల కేటాయింపు తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం అందరూ కలసి పనిచేస్తే మాత్రం కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏకపక్ష విజయాలు సాధించే అవకాశాలున్నాయన్న సర్వేలు కూడా నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మాత్రం బలహీనంగానే కనడుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొంత పుంజుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ఈసారి అందలమెక్కడం ఖాయమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇక్కడ మాత్రం…
అయితే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటి వరకూ ఫోకస్ పెట్టలేదు. నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఇంకా వీక్ గానే కనపడుతుంది. అక్కడ పుంజుకోగలిగితేనే అధికారానికి చేరువవుతుంది. లేకుంటే మూడోసారి కూడా తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. టిక్కెట్లు ఖరారయిన తర్వాత ఎటువంటి వైరుధ్యాలు, విభేదాలు లేకుండా సమిష్టిగా పనిచేస్తే మాత్రం ఈసారి కొంత కాంగ్రెస్ కు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నది కూడా అంతే వాస్తవం. మరి కాంగ్రెస్ నేతలు ఐక్యతతో పార్టీని గెలిపించుకుంటారా? లేదా ఎప్పటిలాగానే వీధినపడి పవర్ ను చేజేతులా చేజార్చుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story