ప్రమాదపుటంచున 3000 సం|| నాటి ఇనుప యుగపు కట్టడాలు
చెరిగిపోతున్న క్రీ.పూ. 1000 ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు నల్గొండ జిల్లాలో కనుమరుగవుతున్న ఇనుప యుగపు కట్టడాలు
చెరిగిపోతున్న క్రీ.పూ. 1000 ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు నల్గొండ జిల్లాలో కనుమరుగవుతున్న ఇనుప యుగపు కట్టడాలు
------- కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు, 21:
నల్గొండ జిల్లా, గుండ్లపల్లి మండలం, రహమంతాపూర్ గ్రామ శివారులో రామేశ్వరగుట్ట పై క్రీ.పూ. 1000 సం|| నాటి ఇనుప యుగపు కట్టడాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ఎలిమినేటి వెంకట్ ద్రావిడ్ ఇచ్చిన సమాచారం మేరకు, బుధవారం ఆయన గుట్ట పరిసరాల్లో జరిపిన అన్వేషణలో గుట్టపైన కాకతీయ కాలపు త్రికూటాలయం కుడి వైపున గదులను పోలిన డాల్మెన్ అనే ఇనపయుగపు సమాధుల ఆనవాళ్లున్నాయని, క్వారీ పనుల్లో భాగంగా కొన్ని ధ్వంసం కాగా, మిగిలిన ఒకే ఒక కట్టడం ప్రమాదపుటంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక రామేశ్వరగుట్టపై 5 అడుగుల ఎత్తు రాళ్ల వరుసపై, 25 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, అడుగున్నర మందం గల పెద్ద గ్రానైట్ రాతి పలకను అమర్చి, ఒకవైపు ద్వారంతో, అప్పుడే అందుబాటులోకి వచ్చిన ఇనుప పనిముట్లతో మరణించిన వారికి స్మారకంగా నిర్మించిన ఇనుప యుగపు కట్టడం, అప్పటి పజల సాముహిక శ్రమకు, కట్టడ నైపుణ్యానికి, అలనాటి ఆచారానికి అద్దం పడుతుదని స్థానికులకు శివనాగిరెడ్డి అవగాహన కల్పించారు. ఈ స్థావరానికి దగ్గరలోని జూపల్లి గుట్టపైన ఇలాంటి డాల్మెన్లున్నాయని చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ, ఇర్విన్ దగ్గర ఇదే కాలానికి చెందిన మెన్ హిర్లనే ఇనప యుగపు నిలువురాళ్లు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆనవాళ్లు కొల్పోతునాయని తనకు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ చరిత్రకు ఆధారాలైన 3000 సం|| నాటి ఇనుపయుగపు కట్టడాలు అవగాహన లేక అంతరించి పోతున్నాయననీ, ఉన్న ఒక్కదాన్నైనా కాపాడుకొని భవిష్యత్ తరానికి అందించటానికి పూనుకోవాలని రహమంతాపూర్ గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి సత్యనారాయణాచారి, అండేకార్ నర్సోజీ పాల్గొన్నారని ఆయన చెప్పారు.