Sun Dec 22 2024 12:15:36 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు.. 24 గంటల్లో 31 కాన్పులు : మంత్రి అభినందనలు
కాన్పులు చేయించుకున్నవారిలో 17 మందికి సుఖప్రసవం జరుగగా.. 14 మందికి సిజేరియన్లు చేశారు. ఈ ప్రసవాల్లో..
జనగామ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ వైద్యులు రికార్డు నమోదు చేశారు. 24 గంటల్లో 31 కాన్పులు చేసి..రెండో అత్యధిక కాన్పులు చేసిన ఆసుపత్రిగా రికార్డు సృష్టించారు. సోమవారం (జులై24) ఉదయం 9 గంటల నుంచి మంగళవారం (జులై25) ఉదయం 9 గంటల మధ్య ఈ కాన్పులు నిర్వహించారు. కాన్పులు చేయించుకున్నవారిలో 17 మందికి సుఖప్రసవం జరుగగా.. 14 మందికి సిజేరియన్లు చేశారు. ఈ ప్రసవాల్లో 19 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా కాన్పుల్లో పాల్గొన్న వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్రవంతి, సౌమ్యారెడ్డి, శ్రీసూర్య, నర్సింగ్ సిబ్బంది సంగీత, విజయరాణి, సెలిస్టీనాలను ఎంసీహెచ్ ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు అభినందించారు.
24 గంటల్లో 31 కాన్పులు చేసి రికార్డు సృష్టించిన ఆసుపత్రి సిబ్బందిని తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. "ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. జనగామలోని MCH ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 31 ప్రసవాలు జరిగాయి. మీ నిబద్ధత, అంకితభావానికి.. మొత్తం బృందానికి అభినందనలు" అని ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా.. గతేడాది ఇదే ఎంసీహెచ్ లో ఒకేరోజు 36 కాన్పులు జరిగాయి. జనగామ ఎంసీహెచ్ లో రోజుకు సగటున 10 నుంచి 12 కాన్పులు జరుగుతాయని వైద్యులు తెలిపారు.
Next Story