Tue Nov 05 2024 12:31:53 GMT+0000 (Coordinated Universal Time)
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో క్రీ.పూ. 1000 ఏళ్ల అతిపెద్ద రాతి రేఖా వృతం
నగర సమీపంలో వెలుగు చూచిన అరుదైన బృహత్ శిలాయుగపు చిత్రకళ ఇంత పెద్ద చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేదంటున్న పురావస్తు పరిశోధకులు
నగరానికి కూత వేటు దూరంలోని, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా మండల కేంద్రం, మూడుచింతలపల్లి శివారులో బృహత్ శిలా(ఇనుప) యుగానికి చెందిన అతిపెద్ద రాతి రేఖాచిత్రం వెలుగుచూచిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. షామీర్ పేట- బొమ్మలరామారం దారిలో గల మూడుచింతలపల్లి శివారులో రోడ్డుకు ఎడమవైపున వృత్తాకారపు రాతి రేఖాచిత్రం ఉందని శ్రీ రామోజు హరగోపాల్ నేతృత్యంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొరవి గోపాల్, మహమ్మద్ నజరుద్దీన్, అహోబిలం కరుణాకర్, అన్వర్ భాష ఇచ్చిన సమాచారం ఆధారంగా శివనాగిరెడ్డి వారితో కలిసి ఆదివారం నాడు ఆ రేఖా చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
కొద్దిపాటి ఎత్తు గ్రానైట్ కొండపై 7.5 మీ. వ్యాసంతో, 30 సెంటీమీటర్ల మందంతో చుట్టూ ఒక వలయంతో, మధ్యలో రెండు త్రిభుజాకారాలతో ఉన్న వృత్తం ఆధునిక పరికరాలతో గీయించినంత కచ్చితంగా,అందంగా ఉందన్నారు. ఈ వృత్తానికి సమీపంలో కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు అరగదీసిన గాళ్లు, 1 కి. మీ. పరిధిలో శిలాయుగపు ఎద్దులు, దుప్పులు, మనుషుల వర్ణ చిత్రాలు ఉన్న కొండచారియ, గుహ ఆవాసాలు ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.
మూడుచింతలపల్లి వృత్తకారపు రాతి రేఖాచిత్రం ఏ కాలనీకి చెందిందని, ప్రముఖ పురావస్తు, శిలాయుగ చిత్రకళ నిపుణులు, ఆచార్య రవి కోరిశెట్టార్ ను అడగగా, ఆ రేఖ చిత్రం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఇనుప యుగానికి చెందిందని, ఆ కాలపు ప్రజలు, గుండ్రంగా నిర్మించుకునే సమాధులకు ఒక నమూనాగా ఉపయోగపడి ఉంటుందని చెప్పారన్నారు. హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన ఈ పురా చిత్ర స్థావరాన్ని ఆర్కియాలజీకల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని, ఇంతటి చారిత్రక ప్రాధాన్యత గల స్థావరాన్ని కాపాడుకొని భావితరాలకు అందించాలని మూడుచింతలపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Next Story