Sun Mar 16 2025 12:04:08 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : మృతదేహాలను వెలికి తీయాలంటే.. రోబోలను ఉపయోగించాల్సిందేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేడు పదమూడో రోజుకు చేరుకుంది. అయినా కార్మికుల జాడ తెలియరాలేదు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేడు పదమూడో రోజుకు చేరుకుంది. అయినా కార్మికుల జాడ తెలియరాలేదు. కార్మికులు ఇక బతికి ఉండే అవకాశాలు లేవన్నది సహాయక బృందాలు చెబుతున్నాయి. మృతదేహాల కోసమే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లో నీటి ఊట నిరంతరం కొనసాగుతుండటంతో రోబోల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. మట్టి తవ్వకాలు జరిపితేనే తప్ప మృతదేహాల ఆచూకీ లభ్యం కాదని సహాయక బృందాలు చెబుతున్నాయి.
శిధిలాలను...
రోబోటిక్స్ ను ఉపయోగించుకుని వేగంగా సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. లోపల నిరంతరం నీరు ఉబికి వస్తుండటం, ధ్వంసమయిన టీబీఎం మిషన్ శిధిలాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకురాకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. సహాయక బృందాలు అక్కడికు వెళ్లి తిరిగి వెనక్కు వస్తున్నాయి. కార్మికుల మృతదేహాలు ఉన్నాయని భావించి మార్క్ చేసిన చోట తవ్వకాలు జరపాలంటే రోబోలతోనే సాధ్యమని నమ్ముతున్నారు.
బంధువులను వెనక్కు...
మరొకవైపు పదమూడు రోజులవుతున్నా టన్నెలో చిక్కుకున్న వారి జాడ తెలియక పోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి బంధువులను వెనక్కు పంపారు. తాము ఏదైనా సమాచారం వస్తే తెలియపరుస్తామని, మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్ లలో గ్రామాలకు చేరుస్తామని చెప్పి వారిని అధికారులు పంపిచి వేశారు. మొత్తం పదకొండు శాఖలకు చెందిన సహాయక బృందాలు నిరంతరం పనిచేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నది కూడా అధికారులకే అర్థం కాకుండా ఉంది.
Next Story