Wed Dec 18 2024 04:52:26 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ రెడీ అయిపోయిందా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. పార్ములా ఈ కారు రేసింగ్ లో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణకు సిద్ధమయినట్లు తెలిసింది. ఈ ఫార్ములా రేసింగ్ కోసం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ 52 కోట్ల రూపాయలను విడతలుగా ఆ కంపెనీకి విడుదల చేయడంపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ నిధులను మంత్రివర్గ సమావేశం అనుమతి లేకుండా విడుదల చేయడాన్ని ప్రభుత్వం తప్పుపడుతుంది.
నోటీసులు ఇచ్చి...
ఎప్పుడైనా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు ఏసీబీ అధికారులు పిలిచే అవకాశముందని తెలిసింది. కేటీఆర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెద్దయెత్తున అవినీతికి పాల్పడిన కేటీఆర్ ను కటాకటాల వెనక్కు నెట్టాలన్న యోచనలో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కారు రేసింగ్ ను వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే గవర్నర్ నుంచి విచారణకు అనుమతి తీసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.మరోవైపు కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా త్వరలో పెద్ద బాంబు పేలనుందన్న కామెంట్స్ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ అనుమతితో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించేందుకు అవకాశం ఉందని తెలిసింది.
అవును నిజమే.. నేనే ఇచ్చా...
ఫార్ములా ఈ కారు రేసింగ్ విషయంలో కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే తనపై కేసు నమోదవుతుందని భావించిన ఆయన తాజాగా చేసిన ట్వీట్ అందుకు అద్దం పడుతుంది. బెంగళూరులో ఫార్ములా ఈ రేసింగ్ కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. కేటీఆర్ తొలి నుంచి తాను మాత్రమే హెచ్ఎండీఏ నిధులను విడుదల చేశానని, మంత్రిగా అది తనకున్న అధికారమని, దానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం అవసరం లేదని తెలిపారు. అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే తాము ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. వీలయినంత త్వరగా ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మూడు విడతలుగా విడుదలయిన నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నారని తెలిసింది.
Next Story