Sun Dec 22 2024 17:49:54 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ పాదయాత్రలో హీరోయిన్ పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్ అటు సినిమాల విషయంలోనే కాకుండా.. పలు అంశాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగమై అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన నాలుగో రోజుకు చేరుకుంది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మపుర్ నుంచి శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభమైంది.
శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ వెంట హీరోయిన్ పూనమ్ కౌర్ నడిచారు. రాహుల్ గాంధీతో ఆమె సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో.. లంబాడ కళారూపాలతో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాహుల్‌తో కలిసి కాలు కదిపారు.
ఉదయం 10 గంటలకు ఎనుగొండలోని గోపాల్ రెడ్డి గార్డెన్ లో రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్రను కొనసాగించనున్నారు. రాత్రి 7 గంటలకు జడ్చర్లలో పాదయాత్రను ముగియనుంది. గొల్లపల్లిలోని శ్రీ సద్గురు మహర్షి మలయాల స్వామి లలితాంబిక తపోవనంలో బస చేయనున్నారు. ఈ రోజు మొత్తం 20.3 కిలోమీటర్లు నడువనున్నారు. సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.
Next Story