Mon Dec 23 2024 04:39:33 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అధికారంలోకి వచ్చిందే కానీ.. ఆనందం లేదా.. ఆరు నెలలయినా పిలుపు రాలేదే? పుణ్యకాలం పూర్తవుతుందే?
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఊహించని విజయంగానే చూడాలి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఊహించని విజయంగానే చూడాలి. బలమైన కేసీఆర్ ను ఎదుర్కొని తాము అధికారంలోకి రాగలమా? అన్న సందేహాలు ఎన్నికలకు ముందు వరకూ అనేక మంది నేతల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతోనూ, కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా పార్టీలోనే ఉంటూ విజయానికి కృషి చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మన సమస్యలన్నీ తీరినట్లేనని అందరూ భావించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టిక్కెట్ రాని నేతలు, పదేళ్లపాటు పార్టీ జెండాను దించకుండా మోసిన ముఖ్య కార్యకర్తలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
ఏదో ఒక పదవి....
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పదవి వస్తుందని భావించారు. నామినేటెడ్ పదవుల్లో తమకు పిలిచి కూర్చోబెడతారని ఆశించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలయినా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇంకా అడుగు ముందుకు వేయలేదు. మొన్నటి వరకూ లోక్సభ ఎన్నికల కారణంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేకపోయింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఇంకా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడం వెనక అనేక కారణాలున్నాయంటున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనుండటంతో మరోసారి వీటి భర్తీ వాయిదా పడే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసి నిరాశకు లోనవుతున్నారు.
జెండా మోయడమే...
కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులు తెచ్చుకోవాలనుకున్నా కేవలం కష్టపడితే సరిపోదు. జెండా మోయడమే అర్హత కాదు. హైకమాండ్ నుంచి ఆశీస్సులుండాల్సిందే. వాటి కోసం ఇప్పుడు మంత్రుల చుట్టూ అనేక మంది నేతలు తిరుగుతున్నారు. తాము గత పదేళ్లుగా పడిన కష్టాన్ని వారి ముందు ఏకరవు పెడుతున్నారు. కార్పొరేషన్లకు ఛైర్మన్ గా నియమించినా చాలంటూ కీలకమైన మంత్రులకు వినతులను అందచేస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడి అయినా పార్టీ విజయం కోసం పనిచేసిన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అనేక అర్హతలు...
వీరికి పదవులు కంటే గౌరవం ముఖ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి తాము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులమని చెప్పుకోవడం గౌరవంగా భావిస్తారు. అందుకే చిన్న పదవుల కోసం కూడా పెద్ద నేతలు పోటీ పడుతున్నారు. అనేక నామినేటెడ్ పోస్టులను ఖాళీగా ఉంచడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలేనని అంటున్నారు. ఆ ఎన్నికలు పూర్తయినా జిల్లాల వారీగా, ప్రాధాన్యత ప్రకారం నామినేటెడ్ పోస్టులు దక్కుతాయి. అదే సమయంలో సామాజికవర్గాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇన్ని హర్డిల్స్ ను అధిగమించి పోస్టు తమ వరకు వస్తుందా? పిలుపు వినిపిస్తుందా? అని అనేక మంది నేతలు ఎదురు చూపులు చూస్తున్నారు.
Next Story