Fri Nov 22 2024 23:08:10 GMT+0000 (Coordinated Universal Time)
రేపే గ్రూప్ 4 పరీక్ష.. ఇవి ఒక్కసారి సరిచూసుకోండి
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్ 1 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2..
తెలంగాణలో రేపు గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. 8,180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ వ్రాత పరీక్ష నిర్వహణకై అధికారులు 2,878 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. 9.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 4 పరీక్షలకు హాజరు కానున్నారు. 40 వేల గదుల్లో పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది టీఎస్ పీఎస్సీ. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెండు పేపర్లలో పరీక్షలు జరుగుతాయి.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్ 1 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగానే వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందే చేరుకోండి. ఫొటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్లలో సంతకాలు.. నామినల్ రోల్ లో పెట్టే సంతకంతో సరిపోవాలని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు పెట్టుకుని రావొద్దని తెలిపింది.
కాగా.. గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీల పేరుతో.. హిందూ మహిళల మనోభావాలు దెబ్బతినేలా పుస్తెలు, మెట్టెలు తొలగిస్తే ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. గాజులు, ముక్కుపుడక, చెవి రింగులు తీసివేసి హిందువులను అత్యంత ఘోరంగా అవమానాలకు గురిచేయడం తగదని వీహెచ్ పీ వాపోయింది. హిజాబ్ ను కనీసం టచ్ కూడా చేయని అధికారులు.. అంతే గౌరవ, మర్యాదలను హిందూ మహిళలకు కూడా ఇవ్వాలని కోరింది. తనిఖీల పేరుతో తాళిబొట్టు, మెట్టెలు, నల్లపూసలు వంటివి తొలగిస్తే.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ను సంప్రదించాలని బజరంగ్ దళ్ నేత పగుడాకుల బాలస్వామి తెలిపారు.
Next Story