Fri Nov 22 2024 09:18:15 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : అందరూ కలసి పనిచేయాల్సిందే..లేకుంటే చర్యలు తప్పవు.. షా వార్నింగ్
నేతలందరూ సమన్వయంతో పనిచేసి తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించేందుకు కృషి చేయాలని అమిత్ షా పిలుపు నిచ్చారు
నేతలందరూ సమన్వయంతో పనిచేసి తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించేందుకు కృషి చేయాలని అమిత్ షా పిలుపు నిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. విభేదాలు వీడి పార్టీ గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. విభేదాలను మరచి సమన్వయంతో పనిచేయకుంటే చర్యలు తప్పవని కూడా సుతిమెత్తంగా అమిత్ షా హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ విజయమే ముఖ్యమని, వ్యక్తిగత ప్రయోజనాలను, మనస్ఫర్థలను పక్కన పెట్టాలని ఆయన కోరారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన వరస సమావేశాలతో పార్టీ క్యాడర్లో, నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
ఆరు గ్యారంటీలను...
అంతకు ముందు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎల్బి స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల పార్టీ అని ఆయన అన్నారు. దేశంలోనే పన్నెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ ను గెలిపించవద్దని ప్రజలను గట్టిగానే కోరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యారంటీల అమలు వరకూ బీజేపీ తరుపున ప్రశ్నించాల్సిందేనని అమిత్ షా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
ఎంఐఎం, కాంగ్రెస్ రెండూ...
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇక్కడ ఎంఐఎం మళ్లీ ఆ పార్టీ పంచన చేరిందని, ఆ పార్టీకి పాతమిత్రుడు ఒవైసీ అంటూ అమిత్ షా అన్నారు. అందుకే అక్బరుద్దీన్ ఒవైసీని రేవంత్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా చేశారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని మజ్లిస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్న అమిత్ షా దాని అమలుతో ముస్లింల పౌరసత్వం రద్దవుతుందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టాలని అమిత్ షా పిలుపు నిచ్చారు. మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశం మరింత బలోపేతం అవుతుంని, బీజేపీ 400 స్థానాలు సాధించే లక్ష్యంతో పని చేయాలని షా మార్గదర్శనం చేశారు. అందుకోసం తెలంగాణలో పన్నెండు సీట్లు గెలిచే విధంగా లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
Next Story