Tue Nov 05 2024 16:21:07 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఘోర రైలు ప్రమాదం జరగనుంది.. ఆగంతకుడి లేఖ కలకలం
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఆ ప్రమాదాన్ని తలచుకుంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. ఆ విషాద ఘటన..
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జూన్ 2న జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో వందలమంది చనిపోయారు. సుమారు 1100 మంది ఆసుపత్రుల పాలయ్యారు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఆ ప్రమాదాన్ని తలచుకుంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. ఆ విషాద ఘటన తర్వాత కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు తృటిలో పెనుప్రమాదాలు తప్పాయి. బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే వారంరోజుల్లో మరో ఘోరమైన రైలు ప్రమాదం జరగబోతోందంటూ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ ఆగంతకుడు రాసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్, డీఆర్ఎం పేరిట గుర్తుతెలియని వ్యక్తి జూన్ 30న రాసినట్టుగా సోమవారం రైల్వే అధికారులకు ఓ లేఖ అందింది.
బాలాసోర్ రైలు ప్రమాదం మాదిరిగానే.. రానున్న వారంరోజుల్లో హైదరాబాద్ - ఢిల్లీ మధ్య మరో ఘోర రైలుప్రమాదం జరగబోతుందనేది ఆ లేఖ సారాంశం. తనకు ఈ సమాచారం నమ్మకమైన వర్గాల నుంచి వచ్చిందని అతను లేఖలో పేర్కొనడం గమనార్హం. దాంతో అప్రమత్తమైన అధికారులు రైల్వే, జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చి.. వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు. పోలీసు యంత్రాంగం ఆ లేఖ రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు.
Next Story