Mon Dec 15 2025 00:12:32 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ కు షాకివ్వనున్న మాజీ మంత్రి
బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది

బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆయన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆయనను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలతో ఆయన పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తన సతీమణి కోసం...
పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణికి చేవెళ్ల పార్లమెంటు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన అదే రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నిన్న మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవడం, నేడు మండలి సమావేశాలకు ఆయన రాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చినట్లయింది.
Next Story

