Wed Dec 25 2024 20:15:11 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అదేనట..గులాబీ పార్టీలో ఆగస్టు నెల టెన్షన్
అధికారంలో ఉన్నప్పడు కేసీఆర్ చూపించిన యాటిట్యూడ్ ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది.
అధికారంలో ఉన్నప్పడు కేసీఆర్ చూపించిన యాటిట్యూడ్ ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. నేతలు వరస పెట్టి వెళ్లిపోతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమకాలంలో తన వెంట నడిచిన నేతలు మినహాయించి మధ్యలో తాను ఆదరించిన నేతలందరూ దాదాపుగా వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. రోజుకు ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో పార్టీని వీడుతుండటం కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వలసలు మాత్రం ఆగేట్లు కనిపించడం లేదు. అధికారం కోసం పరితపించే నేతలు రూలింగ్ లో ఉన్న పార్టీ వైపు చూడటం అంతే సహజం.
కంటితుడుపు చర్యలే...
అయితే స్పీకర్ కు ఫిర్యాదులు, న్యాయస్థానాలను ఆశ్రయించడం కేవలం కంటి తుడుపు చర్యలే. కానీ చేరికలను మాత్రం పూర్తిగా ఆపేందుకు అవి ఉపయోగపడవు. స్పీకర్ కు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆయన వెను వెంటనే అనర్హత వేటు వేస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లినా వెంటనే కేసు తేలుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ఏదో ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి స్పీకర్ కు ఫిర్యాదులు చేస్తూ కొంత ఆపేందుకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లారంటే ఆషామాషీ విషయం కాదు. ఇప్పుడు కేసీఆర్ ఒంటరిగా పోరు చేస్తున్నారనే చెప్పాలి.
జనాన్ని చూసి...
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తన సభలకు హాజరైన జనాలను చూసి ఖచ్చితంగా కొన్ని సీట్లయినా వస్తాయని భావించారు. కానీ వచ్చిన జనాలకు జీరో సీట్లకు అసలు పొంతన లేకుండా పోయింది. దీంతో జనంలోకి అవసరమైన సమయంలో తప్పించి ఊరికే వెళ్లడం వల్ల ఉపయోగం లేదన్న అభిప్రాయానికి గులాబీ బాస్ వచ్చినట్లు కనపడుతుంది. అందుకే ఆయన ఫాం హౌస్ కో, ఇంటికో పరిమితమయ్యారు. తన వద్దకు వచ్చే నేతలను, ప్రజా ప్రతినిధులను మాత్రం కలుస్తూ భవిష్యత్ మనదేనన్న భరోసా ఇస్తున్నారు. ఇటు కేసీఆర్ ను కలసి వెళ్లిన నేతలు కూడా పార్టీని వీడి వెళుతుండటంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
జనం బాట పట్టకుండా...
మరోవైపు కమిషన్లు, కేసులు ఆయనను మానసికంగా ఇబ్బంది పాలు పెడుతున్నాయి. ఊరికే అనలేదు.. పెద్దలు చేసుకున్నవారికి చేసుకున్నంత అని. ఈ సామెత్ మాత్రం కేసీఆర్ విషయంలో ఇప్పుడు అచ్చు గుద్దినట్లు సరిపోయింది. జిల్లాల్లో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయాలంటే కేసీఆర్ రావాల్సిందే నంటున్నారు అక్కడి నేతలు. కానీ ఇప్పుడు రావడం ఎందుకు? అవసరమైనప్పుడు వస్తానులే.. మీరే నా దగ్గరకు వచ్చి వెళ్లండి అంటూ కేసీఆర్ రిప్లై ఇస్తున్నారట. దీంతో కేసీఆర్ ఇక ఇప్పట్లో జనం బాట పట్టే అవకాశాలు లేవని భావించిన నేతలు మరింత మంది కారు దిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. శ్రావణ మాసంలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
Next Story