Thu Nov 21 2024 23:07:09 GMT+0000 (Coordinated Universal Time)
Ponguleti : ఓహో పొంగులేటి పేలుతుందన్న బాంబు ఇదేనా? అదన్న మాట సంగతి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే చెప్పినట్లుగా దీపావళికి ముందే బాంబు పేలిందా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే చెప్పినట్లుగా దీపావళికి ముందే బాంబు పేలిందా? పొంగులేటి చెప్పిన బాంబు ఫాం హౌస్ బాంబా? అన్న చర్చ తెలంగాణ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతుంది. సియోల్ నగరంలో పర్యటనలో ఉన్న పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి నాలుగు రోజుల క్రితం దీపావళికి ముందే పొలిటికల్ బాంబ్ పేలుతుందని తెలిపారు. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే బీఆర్ఎస్ అగ్రనేతలు అరెస్ట్లు ఉంటాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి కంటే ముందే బాంబులు పేలవుతాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉండబోతున్నాయని చెప్పారు.
రాజకీయ సెగలు...
అయితే పొంగులేటి జోస్యం నేడు నిజమయిందంటూ కొందరు రాజకీయనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫాం హౌస్ లోనే ఈ రేవ్ పార్టీ జరగడంతో పాటు అందులో పాల్గొన్న ఒకరికి పరీక్షల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పాజిటివ్ గా రిజల్ట్ వచ్చిందని పోలీసులు తెలపడం, మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం వంటివి చూస్తుంటే కేటీఆర్ ను రాజకీయంగా కట్టడి చేయడానికేనా? అన్న అనుమానం తమకు కలుగుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ పేరును బద్నాం చేయడానికి ఈ కేసును ఒక వాడుకోవాలని చూస్తున్నారన్నారు. కేవలం కేటీఆర్ బామ్మర్ది నిన్న కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారని, అయితే అందులో ఏడు విదేశీ మద్యం బాటిల్స్ ఉన్నాయని, ఒక మనిషి నాలుగు బాటిల్స్ కంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీల్లేదని, దీనిపైనే కేసు నమోదయిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందని అన్నారు.
రెండింటికీ ముడిపెడుతూ...
కానీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకు పోతున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ జరిగిందని, దీనివల్ల తాము కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేటీఆర్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీస్తున్నారు. కేటీఆర్ చెప్పేవన్నీ నిజాలు కాదని, ప్రతి రోజూ ఏదో ఒక అబద్ధం చెబుతూ ప్రభుత్వంపై బురద జల్లే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారన్నారు. చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వారం రోజుల క్రితం చెప్పిన బాంబు ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. రాజకీయ వర్గాల్లోనూ ఇది ముందుగా పొంగులేటికి ఎలా తెలిసిందబ్బా? ఇదేనా? మరేదైనా ఉందా? అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద.. ఫాం హౌస్ లో జరిగిన పార్టీకి, పొంగులేటి కామెంట్స్ కు ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు.
Next Story