Mon Jan 13 2025 00:01:25 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతు రుణమాఫీకి నిబంధనలు ఇవే.. ఇవి ఉంటేనే వర్తింపు.. కసరత్తు చేస్తున్న యంత్రాంగం
తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది
తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మ్యానిఫేస్టోలో రైతు రుణమాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలుపరుస్తామని ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని ప్రతి ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ యా ప్రాంతాలను బట్టి అక్కడి దేవుళ్లపై ఒట్టేసి మరీ రేవంత్ రెడ్డి రుణమాఫీపై ప్రకటన చేశారు.
రెండు నెలలే...
ఆగస్టు 15వ తేదీ అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ రెండునెలల్లో రుణమాఫీని అమలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కూడా కొనసాగింది. రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను రాసి అమరవీరుల స్థూపం వద్ద మీడియా మిత్రులకు కూడా అందచేశారు. అయితే రాజీనామాతో రెడీగా ఉండాలని రేవంత్ రెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. ఇలా తెలంగాణలో రుణమాఫీ సవాళ్లు.. రాజీనామాల డిమాండ్లతో మొన్నటి వరకూ నడిచింది. ఇక మాఫీకి సమయం దగ్గరపడుతుండటంతో దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు.
అర్హులు ఎవరన్నది...?
రుణమాఫీకి అర్హులు ఎవరన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తుంది. అయితే అధికారికంగా అర్హతలు ఏవన్నవి ఇంకా బయటకు రాకపోయినా కొన్ని లీకులయితే మాత్రం బయటకు వచ్చేశాయి. రుణమాఫీ పొందాలంటే ఖచ్చితం పాస్బుక్, రేషన్ కార్డులు ఉండి తీరాలి. దీంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, ఆదాయపు పన్ను చెల్లించేవారిని రుణమాఫీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను పొందుతున్న వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఖజానాపై భారం పడకుండా....
దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా రుణమాఫీ నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాకపోయినా ఇవే నిబంధనలతో రుణమాఫీ జరుగుతుందన్నది అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వంపై భారీగా భారంగా పడకుండా, అదే సమయంలో అర్హులైన వారిని విస్మరించకుండా ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. రెండు లక్షల రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయనుండటంతో ఖజానాపై పడనున్న ఆర్థిక భారం, దానిని అధిగమించేందుకు అవసరమైన చర్యలపై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తి క్లారిటీ వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది.
Next Story