Wed Apr 16 2025 03:19:37 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? అయితే లేటెస్ట్ అప్ డేట్ ఇదే
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గత నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా ప్రత్యేక యాప్ ను కూడా తయారు చేసి లబ్దిదారులకు అందుబాటులోకి తెచ్చారు. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ధారించింది. దీంతో గ్రామసభల ద్వారానూ యాప్ ద్వారా అనేక మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసి తొలి విడత లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
సొంత స్థలం ఉన్నవారికే...
తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఒక్కొక్క లబ్దిదారుడికి మంజూరు చేయనుంది. తెలుపు రంగు రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం ఉన్న వారికే తొలుత ఇస్తామని, తర్వాత దశలవారీగా స్థలాలను సేకరించి మిగిలిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేషన్ కార్డులతో సమానంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. యాప్ ద్వారా సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లు లబ్దిదారుల జాబితాను సిద్ధం చేశారు. అయితే కులగణన సర్వేతో ఈ లబ్దిదారుల జాబితాను సరిపోల్చుకుంటూ అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు.
తొలివిడతలో...
తొలి విడతలో సొంత స్థలం ఉన్న లబ్దిదారుల సంఖ్య దాదాపు 22 లక్షల మంది వరకూ ఉన్నట్లు తెలిసింది. వీరికి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తుంది. ఇచ్చేది ఐదు లక్షలే అయినప్పటికీ లబ్దిదారుడు తమకు కేటాయించిన స్థలంలో ఎన్ని గదుల ఇంటినైనా నిర్మించుకునే వీలుండటంతో అనేక మంది జాబితాలో ఉండేందుకు పోటీ పడ్డారు. దీంతో పాటు సొంత స్థలం లేని వారు దాదాపు 20 లక్షల మంది వరకూ ఉన్నట్లు ప్రభుత్వం తన సర్వే ద్వారా గుర్తించింది. అయితే వీరికి మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణంలో సగం నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలన్న ఉద్దేశ్యంతో కూడా ఉన్నట్లు తెలిసింది. అసంపూర్తి నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి సొంత స్థలం లేని వారికి కేటాయించాలని భావిస్తుంది. మొత్తం మీద ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇప్పడైనాదరఖాస్తుచేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Next Story