భద్రాద్రిలో రాములవారి కళ్యాణం మహోత్సవం: సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాజరు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో రాములవారి కళ్యాణం వేడుకల్లో సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనడం విశేషం.

భద్రాచలం: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ‘‘సీతారాముల కల్యాణం చూతము రారండి’’ అంటూ భక్తజన సముదాయాలు దక్షిణ అయోధ్య భద్రాచలం వైపు పోటెత్తుతున్నాయి. ఆదివారం జరుగనున్న ఈ కళ్యాణోత్సవం మిథిలా స్టేడియంలోని మిథిలా కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో నిర్వహించనున్నారు. దీనికి మిథిలా స్టేడియాన్ని రంగురంగులుగా అలంకరించి, 24 సెక్టార్లుగా విభజించి ప్రతి ప్రాంతంలో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని, భక్తులకు మంచినీరు, మజ్జిగ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. గోటి తలంబ్రాల సమర్పణలో భాగంగా, జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 7 వేల మంది భక్తులు భద్రాద్రికి చేరుకొని తలంబ్రాలు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే రామ నామ స్మరణతో మార్మోగుతున్నాయి.
ఈ పవిత్ర కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వ తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించేందుకు రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. గతేడాది ఎన్నికల కోడ్ కారణంగా రాలేకపోయిన రేవంత్ రెడ్డి, ఈసారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం విశేషం.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖుల రాకతో భద్రాచలంలో ఉత్సవ శోభ అపూర్వంగా కనిపించనుంది.