Fri Dec 20 2024 14:21:13 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీకి చేదు అనుభవం
నర్సయ్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య..
భువనగిరి మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఎంపీ నర్సయ్య అప్పటి తెరాస పార్టీలో ఉండగా ప్రస్తుతం అతను బిజెపిలో చేరారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ భువనగిరి ఎంపీ బిజెపి కార్యకర్తలతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాల్లో వరద ముప్పు ప్రాంతాలను పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే నర్సయ్య లష్కర్ గూడా గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులు మాజీ ఎంపీ నర్సయ్యను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
నర్సయ్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో ఇరుపార్టీల వర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న సమయంలో ఏమాత్రం పట్టించుకోని నర్సయ్య ఇప్పుడు బిజెపి పార్టీలో చేరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అని గ్రామస్తులు ప్రశ్నించారు. గ్రామంలోకి రాకుండా మీరు ఎలా అడ్డుకుంటారు అంటూ గ్రామస్తులపై బిజెపి కార్యకర్తలు ఆగ్రహించారు. గ్రామస్తులకు, బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కబెట్టారు.
Next Story