Sun Dec 22 2024 14:06:14 GMT+0000 (Coordinated Universal Time)
అవినాష్ రెడ్డికి భారీ ఊరట
శనివారం అవినాష్ బెయిల్ పై అవినాష్, సునీత తరపు లాయర్లు తమ వాదనలు వినిపించగా.. నేడు సీబీఐ హైకోర్టులో..
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సీబీఐ అవినాష్ ను కస్టోడియల్ విచారణ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. శనివారం అవినాష్ బెయిల్ పై అవినాష్, సునీత తరపు లాయర్లు తమ వాదనలు వినిపించగా.. నేడు సీబీఐ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో అవినాష్ కు ఊరటనిచ్చేలా హైకోర్టు పలు సూచనలు చేసింది.
అవినాష్ బెయిల్ పై తీర్పును బుధవారం వెల్లడించనుంది. అప్పటి వరకూ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐ ని ఆదేశించాలని అవినాష్ కోరగా.. అవినాష్ తల్లి అనారోగ్యంగా ఉన్నందున అతడిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తీర్పు చెప్పింది. బుధవారం అంటే మే 31 వరకూ సీబీఐ అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ రోజు హైకోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ.. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని తెలిపింది. విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చిన ప్రతిసారి ఏదొక సాకు చెబుతున్నారని తెలిపింది. వివేకా హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి ఎవరితోనే వాట్సప్ కాల్ మాట్లాడారని, ఆ కాల్ ఎవరికి చేశారో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం సాధ్యం కావడం లేదన్న సీబీఐ.. ఆ కాల్ గురించి విచారించేందుకే కస్టోడియల్ విచారణ చేయాలంటున్నామని కోర్టుకు వివరించింది. వివేకా హత్యకేసులో అవినాష్ ప్రమేయం ఉందని భావిస్తున్న సీబీఐ ఇప్పటి వరకు ఎందుకు అతని మొబైల్ ను స్వాధీనం చేసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. అలాగే అవినాష్ రాజకీయంగా బలమైన వ్యక్తి అయినపుడు అతడికి వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించింది.
అవినాష్ రెడ్డి వివేకాకు శత్రువులైన గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డిలను హత్యకు వాడుకున్నాడని సీబీఐ పేర్కొంది. అవినాష్ నుండే తనకు డబ్బువచ్చిందని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడన్న సీబీఐ.. అవినాష్ రెడ్డి శివ శంకర్ రెడ్డికి డబ్బులు పంపగా.. అతను గంగిరెడ్డికి డబ్బు పంపాడని తెలిపింది. రూ.75 లక్షల్లో 46 లక్షలు మున్నా లాకెర్ నుండి స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. వివేకా హత్య, సాక్ష్యాలు ట్యాంపరింగ్, పోస్టుమార్టం తదితర విషయాలపై హైకోర్టు ప్రశ్నలు వేయగా.. వాటికి సీబీఐ బదులిచ్చింది. వాదోపవాదాలు పూర్తయ్యాక.. అవినాష్ విజ్ఞప్తి మేరకు బుధవారం వరకు అతడి అరెస్ట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Next Story