Mon Dec 23 2024 00:13:48 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ కు బంపరాఫర్ ఇచ్చిన అధిష్టానం
వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలైన మొత్తం 10 మందిని
తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ హైకమాండ్ అవకాశం కల్పించింది. ఇందులో ఏపీ నుంచి సోము వీర్రాజును నియమించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలైన మొత్తం 10 మందిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. పార్టీ హిమాచల్ ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బీహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్వినీ శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, చత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, రాజస్థాన్ లీడర్ కిరోడీ లాల్ మీనాకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.
కొద్దిరోజుల కిందట తెలంగాణ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించగా, శనివారం మరో పది మందిని కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. వరంగల్ లో ప్రధాని మోదీ పర్యటనకు బండి సంజయ్ హాజరయ్యారు. స్టేజ్‌మీద బండి సంజయ్ ప్రసంగం మొదలుకాగానే బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. మోదీ పర్యటన అనగానే సీఎం కేసీఆర్ కు జ్వరమొస్తుందని తనదైన శైలిలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తనకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చిన బీజేపీకి రుణపడి ఉంటానని అన్నారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలో కేసీఆర్ గడీల బద్దలు కొడతామని, బీఆర్ఎస్ పాలనను అంతమొందిస్తామని చెప్పారు.
Next Story