Mon Dec 23 2024 05:50:45 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై నిలిచిపోయిన బులెట్ ప్రూఫ్ కార్.. రాజా సింగ్ ఏమంటున్నారంటే
తాను ఈ బులెట్ ప్రూఫ్ వాహనంతో చాలా ఇబ్బందులు పడుతున్నానని చెబుతున్నారు. బులెట్ ఫ్రూఫ్ వాహనం తరుచుగా చెడిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది. దీంతో మరో వాహనం తెప్పించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఎప్పుడూ వివాదాలు, వార్తల్లో ఉండే ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుండి ప్రమాదం పొంచి ఉండడంతో బులెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయించారు. ఖచ్చితంగా బులెట్ ఫ్రూఫ్ వాహనంలోనే ప్రయాణం చేయాలని పోలీసులు పలుమార్లు రాజా సింగ్ కు సూచించారు. అయితే ఆయన మాత్రం తాను ఈ బులెట్ ప్రూఫ్ వాహనంతో చాలా ఇబ్బందులు పడుతున్నానని చెబుతున్నారు. బులెట్ ఫ్రూఫ్ వాహనం తరుచుగా చెడిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎప్పుడో చంద్రబాబు కాలం నాటి వాహనాలు ఇస్తోందని.. కొత్తవి కొనుగోలు చేసినా వాటిని అధికార పార్టీ మంత్రులకు.. వారికి అనుకూలంగా వుండే అధికారులకు ఇచ్చారని తెలిపారు. మమ్మల్ని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు.. మాకు అండగా తెలంగాణ ప్రజలు ఉన్నారు.. అ దేవుడు ఉన్నాడని ఆయన తెలిపారు. థ్రెట్ లో ఉన్న వారికి ఇలాంటి వాహనాలు ఇవ్వడం సరైనది కాదని.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రాజా సింగ్ ప్రశ్నించారు. నాకు ఇచ్చిన వాహనం ఏదో స్క్రాప్ తో తయారు చేసింది ఇచ్చారని.. ఎన్నో సార్లు రిపేరీకి పంపానని తెలిపారు. ఎన్ని సార్లు చెప్పినా దీనికే ఏదో ఒక ఆల్టరేషన్ జరిపి తిరిగి తనకే ఇస్తున్నారని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని.. థ్రెట్ ఉన్న వాళ్లకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నవాళ్లకు ఇలాంటి పాత వాహనాలు ఇవ్వడం సరైనది కాదన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్లమెంటు సీటు ఆశిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని, ఇందుకోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. 2024లో రాజాసింగ్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో తాను పోటీ చేయాలనుకుంటున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతుందో వేచి చూద్దాం.
News Summary - BJP Ghoshamahal MLA Rajasingh bullet proof vehicle stopped on highway arranged new vehicle and complaint about problems
Next Story