Mon Dec 23 2024 10:29:51 GMT+0000 (Coordinated Universal Time)
నగ్నంగా తిప్పుతుంటే చోద్యం చూస్తున్నారా ? : కిషన్ రెడ్డిపై దాసోజు ఫైర్
ఇప్పుడు రజాకార్ల ఫైల్స్ సినిమా తీసి.. తెలంగాణలో ఏదో లాభం పొందాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ మీద బీజేపీ సవతి తల్లి..
ఇటీవల మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో యావత్ దేశాన్నీ కుదిపేసింది. సర్వత్రా ఆ నిందితులను కఠినంగా శిక్షించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్పందించారు. మణిపూర్ లో ఆడవాళ్లను నగ్నంగా తిప్పుతూ.. శవాలు తగలబడుతుంటే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు ? బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ? ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వారిపై చర్యలు ఉండవని, బీజేపీ నిందితులకు కొమ్ముకాస్తుందన్నారు. రెండు తెగల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి వ్యవహారం అప్పుడే నిద్రలేచి ఎంట్రీ ఇచ్చిన హీరో మాదిరిగా ఉందని విమర్శించారు.
ఇప్పుడు రజాకార్ల ఫైల్స్ సినిమా తీసి.. తెలంగాణలో ఏదో లాభం పొందాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ మీద బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని బాటసింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూడటానికి వెళ్తారు? కేంద్రం వాటి నిర్మాణానికి ఒక్క పైసా ఇవ్వకపోయినా.. ఎలా కట్టారో చూసి రండి అని సలహా ఇచ్చారు. మోదీ సమకాలీకుడని చెప్పుకునే కిషన్ రెడ్డి.. ఆసియా లోనే అతిపెద్ద స్లమ్ అయిన ధారవిని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారని.. నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే.. అలా హైదరాబాద్ లో ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపించాలని.. దాసోజు సవాల్ చేశారు. ఆ బస్తీకి అదానీ పేరు పెట్టినా, అంబానీ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై మాట్లాడే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదన్నారు. అవినీతి గురించి మాట్లాడే బీజేపీ.. వేలకోట్ల అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయిన నీరవ్, విజయ్ మాల్యాలను ఎందుకు దేశానికి తిరిగి తీసుకురాలేక పోతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం వస్తుందని పదే పదే అంటున్నారని.. ఆ పనికిరాని బుల్డోజర్ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే.. ముందు సొంతపార్టీలో సమస్యలను పరిష్కరించుకుంటాడని అనుకున్నానని, కానీ.. తన ఇల్లు చక్కబెట్టుకోకుండానే తమ మీద పడ్డారన్నారు. సొంతపార్టీ నేత అయిన విజయశాంతియే.. ద్రోహుల్ని పక్కనపెట్టుకున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారని గుర్తు చేశారు.
Next Story