కేసీఆర్ అహంకారానికి నిదర్శనమిది.. ఈటల ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీనియర్ నేత, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజులు నిర్వహించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం బీఏసీ సమావేశం ఏర్పాటు చేయకుండా మూడు రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడమేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉమ్మడి ఏపీలో 80 నుంచి 90 రోజులు సమావేశాలు జరిగేవి. బడ్జెట్ సమావేశాలు 40 నుంచి 50 రోజుల వరకూ జరిగేవి. తెలంగాణ ప్రజానీకం రెండోసారి అధికారం కట్టబెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మరమనిషిలా తయారయ్యారని.. సీఎం ఏది చెబితే అదే చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లాగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఇంత తక్కువ సమావేశాలు జరగలేదని.. బీఏసీని సంప్రదించకుండా మూడు రోజులకు పరిమితం చేశారని అన్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. గత సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని ప్రశ్నించినందుకు తమను అకారణంగా సస్పెండ్ చేశారని ఈటల అన్నారు. అసెంబ్లీలో తప్పించుకోవచ్చు కానీ ప్రజల చేతిలో టీఆర్ఎస్ సర్కార్‌కి శిక్ష తప్పదని ఆయన అన్నారు. అవకాశం వస్తే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడతామని.. లేకుంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు.