Wed Mar 26 2025 20:25:01 GMT+0000 (Coordinated Universal Time)
జూన్ 22 నుంచి బోనాలు
2న గోల్కొండలో బోనాల జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. జులై9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు..

ఈ ఏడాది జూన్ 22వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేటలోని హరితప్లాజా హోటల్ లో శుక్రవారం బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ లతో నిర్వహించిన ఈ సమావేశంలో బోనాల ప్రారంభం, ఏర్పాట్లు, వాటికయ్యే ఖర్చులు, భద్రత తదితర అంశాలపై చర్చించారు.
బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించినట్టు మంత్రి తలసాని వెల్లడించారు. వివిధ శాఖ ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్ల కోసం మొత్తం రూ.200 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 22న గోల్కొండలో బోనాల జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. జులై9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు జరుగుతాయని వెల్లడించారు. గోల్కొండలోని శ్రీజగదాంబిక, సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్నమాదన్న ఆలయాలతోపాటు మొత్తం 26 దేవాలయాలకు బోనాలు సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. అంబారీ ఊరేగింపు నిమిత్తం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వివరించారు. అలాగే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తారన్నారు.
Next Story