Sun Dec 22 2024 22:27:14 GMT+0000 (Coordinated Universal Time)
తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్
కన్నాపూర్ కు చెందిన 20 ఏళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.
తెల్లవారితే పెళ్లి.. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కూతురిని అత్తారింటికి సాగనంపేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఇల్లంతా చుట్టాలు, మామిడి తోరణాలు, ఇంటిముందు పచ్చని పందిరితో కళకళలాడుతోంది. తెల్లవారుజామునే లేచి పనులన్నీ చేసుకోవాలనుకుంటూ పడుకున్నారు. ఆదివారం (మే7) ఉదయం 11 గంటలకు పెళ్లి. పెళ్లికొడుకు మండపానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే చేదువార్త. ఉదయాన్నే లేచిచూసిన తల్లిదండ్రులకు పెళ్లికూతురు కనిపించలేదు. ఆ చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. ఇంకేముంది విషయం వరుడి తరపు వారికి తెలిసింది. చేసేది లేక పెళ్లి రద్దు చేసుకున్నాడు వరుడు. పెళ్లికూతురు తన అక్క భర్తతోనే లేచిపోయిందని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
కన్నాపూర్ కు చెందిన 20 ఏళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. పెళ్లి.. పెళ్లికూతురి ఇంటివద్దే చేయాలని నిర్ణయించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా బాగానే జరుగుతుంది అనుకునేలోపే పిడుగులాంటి వార్త. ఆదివారం తెల్లవారు జామున పెళ్లికూతురు కనిపించటం లేదన్న సమాచారం రెండు కుటుంబాల్లో ఆందోళనకు తెరలేపింది. పెళ్లికూతురు కనిపించడం లేదని వెతుకుతున్న వారందరికీ.. ఆమె తన అక్క భర్తతోనే వెళ్లిపోయిందని తెలిసి షాకయ్యారు. చెల్లెలి పెళ్లికి వస్తే.. తన భర్త తనను మోసం చేసి ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరైంది ఆ ఇల్లాలు. చెల్లెలు - భర్త మధ్య ఇంత జరుగుతున్నా గుర్తించలేకపోయానని వాపోయింది. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story