Thu Dec 19 2024 11:57:06 GMT+0000 (Coordinated Universal Time)
BRS : ఇప్పటి వరకూ 11 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. కొన్ని మాత్రం పెండింగ్
లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు
BRS :లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలపై ఆయన కసరత్తులు చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావించి అందరితో సమావేశమై చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. అందరి ఆమోదం పొందిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటనను జారీ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రచారాన్ని....
ఇప్పటికే కరీంనగర్ నుంచి తొలి సభలో పాల్గొన్న కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం పోరాడేది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల వైఫల్యాన్ని ఎండగడుతూ, మరో వైపు భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహకరించకపోవడాన్ని కూడా ఆయన సభల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. రెండు పార్టీల కంటే తమను ఎన్నుకుంటే రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పనున్నారు.
పదకొండు మంది వీరే...
తాజాగా ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కును, మల్కాజిగిరి స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డిల పేర్లను ప్రకటించారు. వీరిద్దరి పేర్లతో మొత్తం పదకొండు మంది పేర్లను ప్రకటించినట్లయింది. ఇప్పటి వరకూ ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినిపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ ల పేర్లు ఖరారయ్యాయి.
Next Story