Sun Dec 29 2024 15:37:57 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కాంగ్రెస్ సర్కార్ కు కేసీఆర్ శాపనార్థాలు.. వాళ్ల ఉసురుతగులుతుందంటూ
రాష్ట్రంలో మళ్లీ 2014కు ముందు పరిస్థితులు పునరావృతమయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ 2014కు ముందు పరిస్థితులు పునరావృతమయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజనకు రాకముందు పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరువు నాట్యమాడుతుందని అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రజలను అలివికాని హామీలతో టెంప్ట్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల బాగోగులను పట్టించుకోవడం మానేసిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా? లేక కాంగ్రెస్ తెచ్చిన కరువా అని ఆయన ప్రశ్నించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారన్నారు.
ఇచ్చిన హామీలను...
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల పంట నష్టపోయారన్నారు. నీళ్లు లేక రైతన్న రోదనలు మిన్నంటుతున్నాయన్నారు. రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదని కేసీఆర్ శాపనార్థాలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప ఎవరు ఆదుకోవాలని ఆయన ప్రశ్నించారు. తప్పించుకుంటే వీపు విమానం మోత మోగిస్తారు ప్రజలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటీని వాడే విధానం తెలియకనే ఈ కరువు వచ్చిందని కేసీఆర్ అన్నారు. చనిపోయిన 409 మంది జాబితాను ప్రభుత్వానికి పంపినా ప్రయోజనం లేదని ఆయన పెదవి విరిచారు.
వీధుల్లోకి వచ్చి ఎండగడతాం...
గోదావరి నది నిండుగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోలేదన్నారు. పంటలు ఎండిపోవడానికి కారణం కరెంట్ కోతలు కూడా ఒక కారణమని ఆయన అన్నారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని తాను నాలుగు నెలలు ఆగానన్న కేసీఆర్ ఇక ఆగేది లేదన్నారు. జొన్న పంటకు బోనస్ ఇచ్చి మరీ పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, వెంటాడతామని అన్నారు. గొర్రెల యూనిట్లను కూడా బంద్ చేశారన్నారు. దళితబంధు పథకాన్ని నిలిపేశాన్నారు. తాము విడుదల చేసిన డబ్బులను కూడా ఫ్రీజ్ చేశారన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు ఏమయిందని కేసీఆర్ ప్రశ్నించారు.
Next Story