Sat Jan 04 2025 03:38:55 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఏంది బాబాయ్.. కొత్త ఏడాదయినా కనిపిస్తావా? మురిపిస్తావా?
బీఆర్ఎస్ అధినేత గత ఏడాది ఎక్కడా కనిపించలేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారానికి వచ్చారు.
బీఆర్ఎస్ అధినేత గత ఏడాది ఎక్కడా కనిపించలేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. అన్ని జిల్లాల్లో పర్యటించారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ సాధించలేకపోయింది. దీంతో కేసీఆర్ నాటి నుంచి ఎర్రవెల్లి లోని ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఎవరైనా ఆయనను కలవాలనుకున్నాఅక్కడకు వెళ్లాల్సిందే. తప్పఆయన బయటకు రావడం లేదు. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినా ఫాం హౌస్ నుంచి ఒక సంతాప ప్రకటన అయితే పంపారు తప్ప ఆయన మాత్రం బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ సింగ్ తో ఉన్నఅనుబంధంతో ఆయన ఢిల్లీకి వెళ్లి నివాళులర్పించాల్సిన తరుణంలో ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.
అసెంబ్లీ సమావేశాలకు...
మరొకవైపు అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. బడ్జెట్ సమావేశాలకు రాలేదు. సరే..ఇటీవల మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైన సభకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. తనకు మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధం ఆయన తన నోటి నుంచి చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అందరిలో ఉన్నా దూరంగానే ఉన్నారు. ఇక తెలంగాణలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఇటు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినా...
ఈడీ అధికారులు అయితే ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో విచారించే అవకాశాలున్నాయి. అంతే కాదు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంతా తానే అయి ఇన్ని రోజులు కార్యకర్తలకు భరోసాగా ఉన్న కేటీఆర్ కు నోటీసులు వచ్చిన సమయంలోనైనా కేసీఆర్ బయటకు రాకపోవడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు కేసీఆర్ కు జనంలో తిరిగే ఆలోచన ఉందా? లేదా? అన్నది కూడా పార్టీలో తెలియకుండా ఉంది. కేసీఆర్ బయటకు వచ్చి జనంలో తిరిగితే కార్యకర్తలకు కూడా ధైర్యం కలుగుతుందని తెలిసినా ఫాం హౌస్ కే పరిమితమవ్వడమేంటన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది.
కేసులు పెడుతున్నా...
ఎర్రవెల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ కేవలం వ్యవసాయ పనులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా అక్కడకు నేతలకు వెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని, రైతులకు ఇంత వరకూ భరోసా అందలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వచ్చి కనీసం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇటు ప్రజల్లోనూ , అటు కార్యకర్తల్లోనూ ధైర్యం కలుగుతుందని, కానీ కనీసం ఆ పని కూడా చేయకపోతే ఎలా? అన్న ప్రశ్నలు గులాబీ పార్టీ నుంచి వినపడుతున్నాయి. అనేక మంది పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నా కేసీఆర్ బయటకు రాకపోవడంపై పార్టీలోనే ఒకింత నిరాశ నిస్పృహలు బయలుదేరాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story