Sun Dec 22 2024 21:10:27 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ లో మార్పు లేదా? అధికారం కోల్పోయినా ఆయన తీరు మారదా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రారు. ఆయన ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. నేతల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఒకటే తీరు. దొరగారి దర్పం. ఆయన బయటకు రారు. ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆయను మాత్రం పట్టదు. కేసీఆర్ మాత్రం ఫాం హౌస్ లో సేద తీరాల్సిందే. జనంలో కలిసేందుకే గులాబీ దళపతి ఎక్కువగా ఇష్పపడరు. దానికి కారణాలు ఏవైనా ఆయన గత శాసనసభ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు దారుణమైన తీర్పు చెప్పినా ఇంకా మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో వచ్చి నాలుగు డైలాగులు కొట్టి వెళ్లిపోతే ఓట్లు రాలతాయోమోనన్న ఇంకా పాతకాలం నాటి వ్యూహాలను కేసీఆర్ అనుసరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. ఈ నెల వినాయక చవితి అంటే 11 తర్వాత జనంలోకి వస్తానని చెప్పిన కేసీఆర్ రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
వరదలు ముంచెత్తినా...?
సరే... రాష్ట్రంలో సమస్యలు లేవా? అంటే ఎందుకు లేవు. వరదలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు దెబ్బతిన్నాయి. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే జరిగింది. ఏపీకి కేంద్ర బృందాలు వచ్చాయి. తెలంగాణకు మాత్రం ఇంకా రాలేదు. పరిహారం కోసం బాధితులు ఎదురు చూపులు చూస్తున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టినా బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత ఒక పార్టీ అధినేతగా కేసీఆర్ పై ఉంది. కానీ కేసీఆర్ మాత్రం బయటకు వచ్చేందుకే ఇష్టపడటం లేదు. మొన్నటి వరకూ కుమార్తె కవిత జైలులో ఉన్నారని బాధపడుతూ ఇంట్లో కూర్చున్నారనుకున్నా ఆమె కూడా బెయిల్ పై వచ్చారు.
లీకులు ఇస్తూ...
ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాకుండా ఎప్పుడో వచ్చి పర్యటనలు చేస్తామని లీకులు మీద లీకులు వదులుతున్నారు. అది ఫిక్సయిన డేట్స్ కాదు. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికేనని అందరికీ తెలుసు. తనకు బదులు పార్టీ నేతలు హారీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు తిరుగుతున్నప్పటికీ వారితో కేసీఆర్ ను ఒకగాటన కట్టి చూడలేరు. ప్రజలు కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటారు. కేసీఆర్ వచ్చి బాధితుల పక్షాన పోరాటం చేస్తే కొంత వరకూ ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుందని ఆశిస్తారు. కానీ కేసీఆర్ బాధితుల గోడును కూడా పట్టించుకోకుండా ఫాం హౌస్ కే పరిమితమయ్యారంటే ఆయన పార్టీ బలోపేతం పట్ల ఎంతమాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సీఎంగా ఉన్నప్పుడు...
ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎలాగైనా నడిచింది. ప్రజలను కలిసినా, కలవకపోయినా రెండుసార్లు గెలిపించారు. తొమ్మిదేళ్లు ఇంటికే పరిమితం కావడం, సచివాలయానికి వచ్చే ఓపిక కూడా లేక ప్రగతి భవన్ లోనే తిష్ట వేసి కూర్చోవడంతో జనం చాచి కొట్టినట్లు తీర్పు చెప్పారు. ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ కు ఇంతటి దుర్గతి పట్టడానికి ఆ పార్టీ నేతల కానేకాదు. కేవలం కేసీఆర్ వ్యవహారశైలి ప్రధాన కారణమని అందరికీ తెలుసు. ఎందరో నేతలు పార్టీని వదిలి వెళుతున్నారు. అయినా ఆయన తన తీరును మార్చుకోవడం లేదు. నేనింతే నన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన మారరు. పార్టీ బలోపేతం కాదు.. ప్రజలు కూడా అంగీకరించరు.
Next Story