Mon Dec 23 2024 02:14:11 GMT+0000 (Coordinated Universal Time)
BRS : రాత్రికి రాత్రి కండువా మార్చిన ఎమ్మెల్సీలు.. ఇంకా ఉన్నారా? గులాబీ పార్టీకి వరస షాక్ లు
బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. శాసనమండలిలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీలు జంప్ అయ్యారు
బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. శాసనమండలిలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీలు జంప్ అయ్యారు. అర్ధరాత్రి వారు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ శాసనమండలిలో బలం ఉందని కొద్దిగా సంతోషంగా ఉన్న బీఆర్ఎస్ కు ముఖ్యమైన నేతలు పార్టీ ఫిరాయించడంతో ఉన్న సంతోషం ఆవిరయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా వారికి కండువా కప్పి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి స్వాగతం పలికారు.
కనీసం బయటకు పొక్కలేదే...?
ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీలు ఇంత పెద్ద స్థాయిలో పార్టీ మారతారని కారు పార్టీ నేతలు సయితం ఊహించలేదు. ఇది తెలిసిన తర్వాత వారంతా షాక్ అయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో సమావేశమయ్యారు. అంతకు ముందు నుంచే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో మంతనాలు జరుపుతున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం పసిగట్ట లేకపోయింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన నివాసం చేరుకున్న వెంటనే అక్కడకు వచ్చిన ఎమ్మెల్సీలు పార్టీ ఎమ్మెల్సీలు చేరిపోయారు.
నమ్మకమైన వారే....
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ లు పార్టీ రాత్రికి రాత్రి మారిపోయారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు కాంగ్రెస్ లో చేరిపోయారు. రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఊహించని ఈ షాక్ తో కారు పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. నమ్మకమైన వారు వెళుతుండటంతో ఇక ఎవరెవరు వెళతారన్న టెన్షన్ పట్టుకుంది.
Next Story