బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డికి ఊహించని చిక్కులు
పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్
పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో భూమిని ఆయన కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు పెట్టారు. షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని సర్వే నెంబర్ 8 లో 2.25 ఎకరాల భూమి ఉంది ఉంది. ఇందులో చాలా భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడగా 2,185 చ.మీ. (ప్లాట్ నెంబర్ 8-సి) ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సర్వే నెంబర్ లో (8-డి) షౌకతున్నీసా పేరుతో ఉన్న భూమిని ఉపేందర్ రెడ్డి గతంలోనే కొనుగోలు చేశారు. పక్కనే ఖాళీగా ఉన్న 2,185 చ.మీ. స్థలం కూడా తనదేనని చెబుతున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి గతంలో ఒకసారి ఉపేందర్ రెడ్డి ప్రయత్నించగా తహసీల్దార్ అడ్డుకున్నారు. ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లోకి చేర్చారు. దీనిపై ఉపేందర్ రెడ్డికి చెందిన ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపేందర్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి షెడ్లు నిర్మించి, వైన్ షాపు నిర్వహిస్తున్నారు.