Sun Apr 13 2025 14:12:01 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ నేతల్లో జోష్.. కారణమిదేనా?
బీఆర్ఎస్ నేతల్లో ప్రస్తుతం ఆనందం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని భావిస్తున్నారు

బీఆర్ఎస్ నేతల్లో ప్రస్తుతం ఆనందం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని భావిస్తున్నారు. అందుకే నేతలతో పాటు రోడ్డు మీదకు క్యాడర్ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చి ఆరు గ్యారంటీలే తమను ఈసారి అధికారానికి తెస్తాయని నమ్ముతున్నారు. గ్యారంటీలు అందరికీ అందకపోవడంతో పాటు కేసీఆర్ తన హయాంలో అమలు చేసిన పథకాలను ఇప్పటివరకూ అమలు చేయకపోవడం తమకు ప్లస్ పాయింట్ గామారుతుందని అంచనా వేస్తున్నారు.
పథకాలు...
ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంత వరకూ అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని గమనించింది. జిల్లాల్లో, మండలాల్లో బీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇందుకు కారణమని చెప్పారు. కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వాగ్దానం చేయడం, ఇప్పటికే అనేక పెళ్లిళ్లు జరిగిపోవడంతో వారు తమకు రావాల్సిన డబ్బులు రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక పథకాలు అమలు చేసినా అవి కొందరికే అమలుకావడం కూడా తమకు కలసి వస్తుందని నమ్ముతున్నారు.
సోషల్ మీడియాలో కూడా...
దీంతో పాటు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ రెండు అడుగుల ముందే ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పోస్టులు పెడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాదే పైచేయిగా మారింది. దీంతో పాటు ఇటీవల కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని, తమ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తర్వాత కేసీఆర్ కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశముందని ఇక కాంగ్రెస్ పార్టీకి చుక్కలు కనిపిస్తాయంటున్నారు.
Next Story