Sun Apr 20 2025 05:21:54 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ నేతలు జనంలో పలుచన అవుతున్నారా?
బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారు. వాళ్లు చేసే వ్యాఖ్యలతో పార్టీ పరువును దిగజారుస్తున్నారు.

బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారు. వాళ్లు చేసే వ్యాఖ్యలతో పార్టీ పరువును దిగజారుస్తున్నారు. ప్రజల్లో మరింత పలుచన అవుతున్నారు. రాజకీయ విమర్శలు చేయడం వరకూ ఓకే కానీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత డ్యామేజీ చేస్తాయని చెప్పక తప్పదు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పులు చేయడం మినహా ఏం చేసిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడం మినహాయించి పేద ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను కూలదోసేందుకు ప్రయత్నాలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే...
గతంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి రెడీ గా ఉన్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాక పుట్టించాయి. కట్ చేస్తే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపునకు వెళ్లడం చూశాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజా తీర్పును అగౌరవపర్చే విధంగా ఉన్నాయి. అప్పట్లోనే అనేకమంది ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు రియల్టర్లకు, వ్యాపారులకు అండగా నిలిచేటట్లు ఉన్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు...
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు, రియల్టర్లు కోరుకుంటున్నారని, అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి తాము ఆర్ధిక సహకారం అందిస్తామని చెప్పారని కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంట రేపుతున్నాయి. కేసీఆర్ ఆత్మగా భావించే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై కుట్ర జరగుతుందనడానికి నిదర్శనమని అన్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మరో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వ్యాఖ్యానించారు. అంటే రియల్టర్లకు, వ్యాపారులకు ప్రభుత్వభూములను అప్పగించి వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవడానికి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...
దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు తొగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు వరసపెట్టి కౌంటర్లు ఇవ్వడంతో పాటు ప్రజల్లో కూడా ఒకరకమైన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట మార్చారు. తనను అడ్డుకున్నా, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను అన్న మాటలను వక్రీకరించి చెబుతున్నారని అన్న ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు విసుగు చెందుతున్నారని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాతీర్పును పక్క దోవ పట్టించే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇలాగే జరిగితే కారు గ్యారేజీకే పరిమితమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story