Sun Dec 22 2024 19:35:23 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవితకు కూడా బెయిల్ వస్తుందా? సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయిగా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వారు బెయిల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల నుంచి తీహార్ జైలులో ఉంటున్నఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆశలు మెరుగయ్యాయి. మనీష్ సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ లభించినప్పటికీ, తమ నేత కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఒకరికి బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత తరుపున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
మార్చి 15న అరెస్టయి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు. ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లు విచారించి కేసులు నమోదు చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని, సౌత్ లాబీయింగ్ తో చర్చలు జరిపి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్ల రూపాయలు నిధులు చేరవేశారని ఈడీ, సీీబీఐలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీని మార్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని, అందుకు ఆమెకు పెద్దయెత్తున డబ్బులు ముట్టాయని కూడా ఈడీ ఆరోపించింది. ఈనేపథ్యంలో గత ఐదు నెలల నుంచి కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.
సిసోడియాకు రావడంతో...
కానీ ఇప్పుడు మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడంతో కల్వకుంట్ల కవిత అనుచరుల్లో కొంత ఆశలు రేగాయి. ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ కేసులో బెయిల్ లభించింది. అయితే సీబీఐ కేసు విషయంలో మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన తీహార్ జైలులోనే ఉంటున్నారు. గత ఐదు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్న కవితకు బెయిల్ దరఖాస్తు చేయడానికి ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావులు ఢిల్లీకి చేరుకున్నారు. న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. కవితకు బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో బీఆర్ఎస్ నేతలున్నారు. మరి కవిత కూడా సుప్రీంకోర్టులో బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story