Sat Dec 21 2024 10:05:20 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : ఇది శ్వేత పత్రం కాదు.. తప్పులు తడక కాగితమే
గత ప్రభుత్వంపై బురదజల్లడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
గత ప్రభుత్వంపై బురదజల్లడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో అంతా సత్యదూరమయిన విషయాలను చెప్పారని అన్నారు. లెక్కలు తప్పులు చూపించే ప్రయత్నం చేశారన్నారు. 775 కోట్ల రూాపాయలు ఖర్చు చేసి మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. రాయలసీమల ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారని హరీశ్‌రావు అన్నారు. ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని హరీశ్ రావు అన్నారు.
అబద్ధాలు చెబుతూ...
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తామని ఎందుకు ఒప్పుకున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎకరాకు కూడా సాగునీరు అందలేదని పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అబద్ధాన్ని పదే పదే చెబుతూ పోతే అది నిజం అవుతుందని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ప్రాణహిత చేవేళ్లలను తాము మార్చాలని అనుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించాలని భావించిన చోట నీళ్లు సరిగా లేదని కేంద్ర జల సంఘం చెప్పడంతో రీ డిజైన్ చేసుకోవాల్సి వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనకబడి ఉన్నాయని అన్నారు.
చర్యలు తీసుకోండి...
తమ పాలనలో తప్పులు జరిగాయని భావిస్తే చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. కానీ నేడు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాయని అన్నారు. సాగునీటి లభ్యత పెరిగిందన్నారు. భూ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. చెరువులకు నీళ్లొచ్చాయని అన్నారు. పుష్కలంగా చేపలు ఉన్నాయని తెలిపారు. నాడు వలసలు ఉండేవని, నేడు వలసలు వాపస్ వచ్చాయని, దక్షిణ భారత ధాన్యాగారంగా తెలంగాణను మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే నని అన్నారు. నేడు తెలంగాణ భూముల ధరలు చూసినా ఈ విషయం అర్థమవుతుందని, అసలు సాగునీరే అందలేదని అనడం అబద్ధం చెప్పడం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story