Mon Jan 13 2025 19:55:52 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయలేరా? కారు పార్టీలో ఆయనను అట్లా వదిలేసినట్లేనా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నారు. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలి సారి ఎన్నికయిన పాడి కౌశిక్ రెడ్డి ఆది నుంచి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. వివాదాస్పద కామెంట్స్ చేయడమే కాకుండా దూకుడుగా వ్యవహరిస్తుండటం పార్టీకి ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల ప్రచారంలోనే పాడి కౌశిక్ రెడ్డి సంచలనం సృష్టించారు. తనను గెలిపించకుంటే కుటుంబ సభ్యులతో కలసి ఆత్మహత్యలు చేసుకుంటామని నియోజకవర్గ ప్రజలను ఎన్నికల సమయంలో బెదిరించారనే చెప్పాలి.
తొలిసారి గెలిచి...
చివరకు ఎట్టకేలకు గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ఉత్త ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అయితే గెలిచిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కారు పార్టీలోనే ప్రయాణిస్తున్నారు. అందరు ఎమ్మెల్యేల తీరు ఒకలా ఉంటే.. పాడి కౌశిక్ రెడ్డి తీరు మరొలా ఉంది. ఆయన ఎక్కడకు వెళ్లినా సమస్యే అవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ తరుపున రెచ్చిపోవడం, స్పీకర్ తో చివాట్లు తినడం మామూలయిపోయింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి చేసే వ్యాఖ్యలు వారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో వివాదం తీవ్రమై చివరకు కాంట్రవర్సీకి దారితీస్తుందనే చెప్పాలి.
కాంట్రవర్సీలకు కేరీఫ్ గా...
అనేక సార్లు వివాదాలకు కారణమైన పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం కారు పార్టీ కంట్రోల్ చేయలేకపోతుందంటున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి గెలిస్తేనే ఇంత ఫైర్ చూపిస్తుంటే.. ఇక మరోసారి గెలిస్తే ఎలా ఉంటుందోనని ప్రజాప్రతినిధులు సయితం ముక్కున వేలేసుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి యాటిట్యూడ్ ను తప్పుపడుతున్నారు. కేవలం కేసీఆర్, కేటీఆర్ ల వద్ద మన్ననలను పొందేందుకే అలా వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తాజాగా కరీంనగర్ లోనూ హుజూరాబాద్ ఎమ్మెల్యే సంజయ్ పై ఆయన దూకుడుతో వ్యవహరించిన తీరుపై రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా కౌశిక్ రెడ్డిని కంట్రోల్ పెట్టకుంటే పార్టీకి నష్టమే తప్ప లాభమంటూ ఏమీ ఉండదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story