Thu Dec 19 2024 19:20:53 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే..నేడు కోర్టు ఎదుటకు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి రాత్రి ఢిల్లీ తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి రాత్రి ఢిల్లీ తీసుకెళ్లారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. ఈరోజు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కల్వకుంట్ల కవితను ప్రవేశపెట్టబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను నిన్న హైదరాబాద్ లో ఆమె నివాసంలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాత్రికి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈరోజు ఢిల్లీలో ఏం జరగబోతుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.
వైద్య పరీక్షల అనంతరం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ కింద కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఈరోజు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈలోపు కవిత తరుపున న్యాయవాదులు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగానే తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ కవిత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు.
ఈ కేసులో అనేక మందికి...
అయితే ఈ కేసులో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనేక మంది నిందితులు ఆరు నుంచి ఏడు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటకు వచ్చారు. నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రెండేళ్ల నుంచి ఇదే కేసులో జైలులోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ కూడా లభించలేదు. అయితే కవిత కేసు డిఫరెంట్ అని ఆమె తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కింద కవిత పిటీషన్ ను చేపడతారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశమే.
ఛాలెంజ్ పిటీషన్ పై...
కవిత వేసే ఛాలెంజ్ పిటీషన్ పై కూడా ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. వారు రిమాండ్ పిటీషన్ వేస్తారని తెలిసింది. అయితే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండటంతో కోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. కవితను విచారించేందుకు రిమాండ్ ను ఈడీ అధికారులు కోరనున్నారు. ఇప్పటికే కవిత తరుపున న్యాయవాదులు ఛాలెంజ్ పిటీషన్ కోసం అంతా సిద్ధం చేశారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story