Thu Jan 09 2025 17:59:41 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? ఈరోజు ప్రశ్నించి వదిలేస్తారా?
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ ప్రారంభమయింది. న్యాయవాది ఉండేందుకు ఏసీబీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో తొలి రోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. నిన్న ఐఏఎష్ అధికారి అరవింద కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తాము నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేశామని అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఇందులో తన ప్రమేయం లేదని, కేవలం మంత్రి ఆదేశాల మేరకే తాము నగదును బదిలీ చేశామని పేర్కొన్నారు.
ఎలక్షన్ కోడ్...
ఎన్నికల నిబంధనలు అమలులో ఉండగా నిధులను విడుదల చేయడంపై కూడా ఏసీబీ అధికారులు ఈరోజు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా ఎలా నిధులను మంజూరు చేశారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐలు ఈ విచారణలు చేపట్టారు. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు 54 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడంతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీసే అవకాశముంది. ఫార్ములా ఈ రేసు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే ఎన్నికల బాండ్ల కొనుగోలును ఆ కంపెనీ చేయాల్సి వచ్చిందన్న దానిపై కూడా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశముందని తెలిసింది.
తొలిరోజు విచారణ...
ఎలాంటి రేస్ జరగకుండా యాభై నాలుగు కోట్ల రూపాయల నగదును ఎలా చెల్లించారని కూడా కేటీఆర్ ను నేడు ప్రశ్నించే అవకాశాలున్నాయి. బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కూడా కేటీఆర్ నేడు ఏసీబీ నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశముందని తెలిసింది. అరవింద్ కుమార్ తో పాటు దాన్ కిషోర్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. అయితే కేటీఆర్ ను ఈరోజు ప్రశ్నించి వదిలేస్తారా? లేక ఈరోజు అరెస్ట్ చేస్తారా? అన్నది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇంకా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించి ఉండాల్సి ఉండటంతో అరెస్ట్ చేయరని, ఈరోజు ప్రశ్నించి వదిలేసి మరొకతేదీకి రావాలని నోటీసులు కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.
Next Story