Mon Mar 31 2025 07:33:22 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా? విచారణకు పిలిచి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించే అవకాశముంది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించే అవకాశముంది. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని కేటీఆర్ ను కోరే అవకాశాలున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులను 54 కోట్ల రూపాయల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారని ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1 నిందితుడిగా కేటీఆర్ ఉన్నారు. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 నిందితుడిగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.
ఏడు గంటల పాటు...
ముగ్గురిని విచారించిన ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఏసీబీ కేటీఆర్ ను దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. దాదాపు నలభై ప్రశ్నలకు సమాధానాలను రాబట్టింది. ప్రధానంగా హెచ్ఎండీఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా ఎందుకు విదేశీ సంస్థకు పంపారన్న దానిపై ఆరా తీశారు. విదేశీ సంస్థతో ఒప్పందం కుదరకముందే ఎందుకు నిధులు పంపాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించారు. ఇలా అనేక రకాల ప్రశ్నలు వేసిన ఏసీబీ అధికారులు తర్వాత తాము విచారణకు రమ్మంటే రావాల్సి ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే మరోసారి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
అరెస్ట్ చేసే అవకాశం...?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగానే ఈ విచారణ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనిపిస్తుందన్న సమాచారం అందుతుంది. ఈరోజు, రేపట్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే తన పై నమోదయిన కేసును కొట్టివేయాలని హైకోర్టును, సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించినా ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో మరోసారి విచారణకు పిలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతున్నారు. మరి కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? లేదా? అన్నది రెండురోజుల్లోనే తెలియనుంది.
Next Story