Wed Apr 09 2025 19:03:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : సారూ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోరూ.. నాటి పదేళ్ల పాలన గుర్తు లేదా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ షాక్ ఇవ్వడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ షాక్ ఇవ్వడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. గతంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అనేక ప్రభుత్వ భూములను విక్రయించారు. అప్పుడు లేనిది ఇప్పుడు కేటీఆర్ కు ప్రభుత్వ భూములు గుర్తుకు వచ్చాయా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. గత పదేళ్లలో కేసీఆర్ వ్యవహరించింది నియంత పాలన కాదా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించేందుకు సిద్ధపడుతున్న భూముల ప్రభుత్వానివే అయినప్పుడు అందులో అభ్యంతరం చెప్పాల్సిన పని ఏముందన్న నిలదీస్తున్నారు. గతంలో కేసీఆర్ అనేక వేల ఎకరాల భూములను అయిన కాడికి విక్రయించిన విషయాన్ని మరచిపోయారా? అని ఫైర్ అవుతున్నారు. గతంలో ఏ ఏ భూములు బీఆర్ఎస్ విక్రయించిందీ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇరుకున పెట్టేందుకు...
రేవంత్ రెడ్డి సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్పించి మరొకటి కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములను విక్రయించి సంక్షేమ పథాకాలను అమలు చేయడానికి, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమకు చెందిన భూములను విక్రయిస్తే తప్పేంటన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లే చర్యలకు తాము వ్యతిరేకమంటున్న కేటీఆర్ గతంలో మీరు చేసిందేమిటి? సామీ అని ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణం, ప్రజలు గుర్తుకు రాకుండా వ్యవహరించిన మీరా? ఇప్పుడు శ్రీరంగనీతులు చెప్పేదంటూ కేటీఆర్ పై కొందరు మండి పడుతున్నారు. రాజకీయ ఆరోపణలు కాదంటూనే సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే కేటీఆర్ ఇలా కామెంట్ చేస్తున్నారంటున్నారు.
నాడు కనిపించలేదా?
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమంలో ఉన్న ఉస్మానియా యూనివిర్సిటీ విద్యార్థులు కంటికి కనిపించలేదు. అలాగే వరంగల్ శాతవాహన యూనివర్సిటీపై కూడా కనికరం చూపించని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు కొత్తగా నీతులు వల్లెవేస్తుందని సెటైర్లు వినపడుతున్నాయి. అసలు పదేళ్ల పాటు గొంతెత్తి నిరసన తెలిపే అవకాశం మీ ప్రభుత్వంలో ఎవరికైనా ఇచ్చారా? అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతోనే ఒంటికాలు మీద లేస్తున్నారని, అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితే కనీసం తమ ఆందోళనలు తెలపడానికి ధర్నాచౌక్ ను కూడా ఎత్తివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మర్చిపోతే ఎలా భయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు.
సర్వింగ్ పార్టీ కావాలట...
ముఖ్యమంత్రి అంటే నాలుగు కోట్ల మంది ప్రజలు పన్నుల కడితే జీతం తీసుకునే ప్రతినిధి అట. రూలింగ్ పార్టీ కాదట. సర్వింగ్ పార్టీ కావాలట. ఎవరు నియంతలా వ్యవహరించారో? కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు కలవని పరిస్థితి గతంలో ఉన్న విషయాన్ని విస్మరించి ఇప్పుడు సుద్దులు పలికితే ఎలా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తవు అని హితవులు చెప్పే కేటీఆర్.. గతంలో కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పుడు ఏమయ్యావంటూ ప్రశ్నిస్తున్నారు. నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యవహరించింది గతంలో అందరికీ తెలుసునని, భూములు కొనుగోలు చేస్తే వాటిని వెనక్కు తీసుకుంటామని బెదరింపులకు దిగడం ఎంత వరకూ సబబని కేటీఆర్ పై మండిపడుతున్నారు.
Next Story