Sun Dec 22 2024 21:26:03 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ఆలోచన కరెక్టేనా? జైలుకెళితేనే ముఖ్యమంత్రి పదవా?
బీఆర్ఎస్ నేత కేటీఆర్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలా జరిగితేనే ముఖ్యమంత్రి అవుతానని భావిస్తున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాను రెడీ .. వచ్చేయండి.. అరెస్ట్ చేయండి అంటూ ప్రభుత్వాన్ని ఒకటే వెంట పడుతున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్న అంచనాతో ఆ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈకేసులో కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమయినట్లు కూడా సమాచారం ఉంది.
సవాళ్ల మీద సవాళ్లు...
అందుకే కేటీఆర్ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, వచ్చి వెంటనే అరెస్ట్ చేసుకోవాలంటూ రారమ్మంటూ ప్రభుత్వానికి పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. జైల్లో ఎన్ని రోజులు ఉన్నా తాను పూర్తి ఫిట్నెస్ తో బయటకు వస్తానని ఆయన చెబుతున్నారు. తర్వాత పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. అంటే ఆయనకంటూ రాజకీయంగా ఒక రోడ్డు మ్యాప్ ను రూపొందించుకున్నట్లే కనపడుతుంది. జైలు కెళ్లడం, పాదయాత్ర చేయడం వంటి వాటితో పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే జైలు కు వెళ్లడానికి ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తహతహలాడుతున్నారు.
ఏపీలోనూ అంతేగా...
తాను జైలుకు వెళితే సానుభూతి పాళ్లు విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలతో ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజుల పాటు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా తాను జైలు కెళితే పార్టీ యువనేతగా తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశముందని అంచనాలు వేసుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేసి ఆయన కోరికను నెరవేరుస్తుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.
పార్టీ బాధ్యతలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కంటే కేటీఆర్ తన ఫేస్ తోనే ఎన్నికలకు వెళ్లాలన్న కసితో ఉన్నట్లు కనపడుతుంది. కేసీఆర్ పార్టీ అధినేతగా పెద్దగా ఉన్నప్పటికీ, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలోనూ ఈసారి కేటీఆర్ మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తులు కూడా ప్రారంభించారు. పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కుతుందని పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను జైలుకెళ్లి రెండు మూడు నెలలు ఉండి వచ్చినా తనతో పాటు పార్టీకి లాభమేనన్న అంచనాతో ఉన్నారు.
Next Story