Sun Dec 22 2024 22:04:07 GMT+0000 (Coordinated Universal Time)
KTR : అడుగులు అధికారాన్ని తెచ్చిపెడతాయట...అందుకే కేటీఆర్ నిర్ణయం
కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు రెడీ అయిపోతున్నారు. సుదీర్ఘ పాదయాత్రతో అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ తనను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్న కార్యకర్తలతో పాదయాత్ర విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎప్పుటి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నది మాత్రం తెలియకున్నా, వచ్చే ఏడాది మొదట్లోనే పాదయాత్రను ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
అనేక సమస్యలపై...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను అమలు పర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రైతు రుణమాఫీ సక్రమంగా జరపకపోవడం, రైతు భరోసాను అమలు చేయకపోవడం, హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వంటి అంశాలతో ఆయన పాదయాత్రను చేపట్టబోతున్నారని తెలిసింది. పార్టీ కార్యకర్తలు, నేతల్లో భరోసా నింపే విధంగా పాదయాత్రను చేపట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. పాదయాత్రను రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించి ఆదిలాబాద్ లో ఎండ్ చేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను రూపొందించే బాధ్యతను కేటీఆర్ ఒక టీంకు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర చేస్తే...
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం దిశగానే కేటీఆర్ అడుగులు పడుతున్నాయి. పాదయాత్ర చేసినందువల్ల రెండు ప్రయోజనాలు దక్కుతాయి. పాదయాత్రతో గతంలోనూ అనేక మంది అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ వైఎస్ జగన్ 2019లో, నారా లోకేష్ 2024 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి తమ పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఇన్ని ఉదాహరణలున్నప్పుడు పాదయాత్ర సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామన్న నమ్మకం నేతల్లో పెరిగిపోయింది.
రెండో ప్రయోజనం...
అందుకే కేటీఆర్ సయితం పాదయాత్రను ఎంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే కేవలం అధికారం మాత్రమే కాదు... రెండో ప్రయోజనం కూడా ఆయనకు ఉంది. అదేమిటంటే కేసీఆర్ బహుశ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి తప్పుకునే వీలుంది. పరోక్ష సహకారం అందించేందుకు ఆయన సిద్ధపడే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అయ్యేందుకు పాదయాత్ర ఖచ్చితంగా దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ గ్రిప్ లోకి కారు పార్టీ వచ్చేసింది. ఇక అధికారంలోకి వస్తే ప్రభుత్వ పెద్దగా కూడా వ్యవహరించే అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదన్న కృత నిశ్చయంతో కేటీఆర్ ఉన్నట్లు కనిపిస్తుంది.
Next Story