Mon Dec 23 2024 16:59:15 GMT+0000 (Coordinated Universal Time)
Bangles : ఒక్క కొడుకు ఉంటే చేతినిండా గాజులు వేసుకోవాలా? పిచ్చ పీక్ కు చేరుకుందిగా?
ఒక్క కొడుకు ఉన్న మహిళ చేతినిండా ఐదు రకాల గాజులు ధరించాలని వారం రోజుల నుంచి తెలంగాణలో ప్రచారం జరుగుతుంది
నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందన్న సామెత ఊరికే పుట్టలేదు. అబద్ధం ఎంత వేగంగా ప్రచారం పొందుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. పైగా సామాజిక మాధ్యమాలలో తలమునకలయ్యే ఈరోజుల్లో మరింత వేగంగా ఒక తప్పుడు ప్రచారం పాకుతుంది. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకోవడం అందరికీ అలవాటుగా మారింది. సెంటిమెంట్ ను సొమ్ము చేసుకోవాలని కొందరు చేసే ప్రయత్నాలతో అన్నీ తెలిసిన వారు కూడా భయపడి అబద్ధాలను నిజం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పెరిగిన గిరాకీ...
గత వారం రోజుల నుంచి తెలంగాణలో ఒక ప్రచారం వైరస్ లా వ్యాపించింది. ఒక్క కొడుకు ఉన్న మహిళ చేతినిండా ఐదు రకాల గాజులు ధరించాలని, లేకుంటే ఒక్కగానొక్క కొడుకుకు ఇబ్బంది కలుగుతుందని కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన మహిళలు గాజుల దుకాణాలకు క్యూ కట్టారు. పైగా ఒక షరతు పెట్టారు. ఇద్దరు మగబిడ్డలున్న మహిళల నుంచే గాజులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో ఇద్దరు మగబిడ్డలున్న మహిళల చెంతకు వెళ్లి వారిని అభ్యర్థిస్తున్నారు. మట్టి గాజుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. సంక్రాంతి దినాలు కీడురోజులుగా భావించి ఒక మగబిడ్డ ఉన్న మహిళ ఖచ్చితంగా ఐదు రకాల గాజులను రెండు చేతులకు ధరించాలని చెప్పడంతో గాజుల దుకాణాలకు గిరాకీ పెరిగింది.
పిచ్చి చర్యగా...
అయితే దీనిని పిచ్చి చర్యగా కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి అరిష్టం లేదని పండితులు చెబుతున్నారు. అయినా వినకుండా టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసిన మహిళలు మాత్రం మట్టి గాజులే కదా? వేసుకుంటే ఏం పోతుంది? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వారిలో ఉన్న భయాన్ని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నంలోనే భాగంగానే ఈకొత్త కాన్సెప్ట్ ను బయటకు తీసుకువచ్చారన్న వాదన కూడా లేకపోలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఒక్క కొడుకు ఉన్నప్పటికీ గాజులు వేసుకోకున్నా అరిష్టం ఏమీ ఉండదని, చెడు జరగదని మాత్రం పండితులు సూచిస్తున్నారు.
Next Story